Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీలను ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 10వ తేదీ నుంచి జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సాంస్కృతిక కళా కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి భుజంగరావు, పులి కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం స్థానిక వినాయక దేవాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సంస్కృతిక కళా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 10 నుంచి 20 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలో 10 పద్య నాటక, 9 సాంఘిక నాటకపోటీలు ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. ఈనెల 20న ముగింపు సభ బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. పద్యనాటిక పోటీల్లో ప్రథమ బహుమతి రూ.40,000 ద్వితీయ బహుమతి 20,000, తృతీయ బహుమతి 10,000, సాంఘిక నాటిక పోటీల్లో ప్రథమ బహుమతి రూ.20,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000 చొప్పున నగదు బహుమతితోపాటు షీల్డ్ అందించబడుతుందని చెప్పారు. పోటీలను విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభిస్తారని,ముగింపు సభకు పర్యటక, క్రీడా, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ హాజరుకానున్నట్టు తెలిపారు. అలాగే, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేవీ.రమణాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోటిరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అగ్రో ఇండిస్టీస్ కార్పొరేషన్ చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్ హాజరవుతున్నట్టు తెలిపారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై పోటీల ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సాంస్కృతిక కళా కేంద్రం నిర్వహణ కార్యదర్శి పీ.రామవతారం, ప్రచార కార్యదర్శి మామిడాల ఉపేందర్, కోశాధికారి పీ.లక్ష్మీనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.