Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వయం సహాయక సంఘాలకు రుణాలు
- షీటీమ్‌ల ద్వారా మహిళా భద్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నదనీ ఆ మేరకు మహిళా స్వయం సహాయ సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) తగిన విధంగా రుణాలు అందజేస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 'ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నది. మహిళా అభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), ఆరోగ్య లక్ష్మీ, కళ్యాణ లక్ష్మీ , మహిళా భద్రత కోసం షీ టీమ్‌లు, భరోసా కేంద్రాలు, ఏర్పాటు చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
సంఘటిత శక్తిని పెంచేందుకు..
మహిళల్లో సంఘటిత శక్తిని పెంచే లక్ష్యంలో భాగంగా 'మహిళా స్వయం సహాయక సంఘాల'ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమ శిక్షణ వైపు మళ్లించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. మహిళా సాధికారతలో స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఆ తర్వాత గత ఎనిమిదేండ్లలో 76,321 స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని, గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం 4,36,512 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్యలు,553 మండల, 17,954 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి.
షీటీమ్‌లు..
రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతా, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే తొలి సారిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అధికారి స్థాయి ఆధ్వర్యంలో ''ఉమెన్ సేఫ్టీ వింగ్''ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. విభాగంలో షీ టీమ్స్, భరోసా, షీ భరోసా సైబర్ ల్యాబ్, మానవ అక్రమ రవాణా నివారణతో పాటు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ప్రవేశపెట్టి సమర్దవంతంగా అమలు చేస్తోంది. మహిళలు సమాజంలో ఎదుర్కుటుంటున్న పలు సమస్యలపై కౌన్సిలింగ్ నిర్వహించి వారీలో భరోసా కల్పించె దిశగా ఆరు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది.
కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్
బాల్య వివాహాలను అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన వధువులకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నది. ఈ పథకం అమలల్లోకి వచ్చిన తరువాత బాల్యవివాహాల శాతం తగ్గడమే కాకుండా మహిళ అక్షరాస్యత మెరుగుపడింది.
ఆరోగ్య సంరక్షణ కోసం..
తల్లీ బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసమే కేసీఆర్‌కిట్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.దీంతో ఇప్పటి వరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు ఆటంకంగా ఉన్న పోషకాహార,ఇమ్మ్యూనైజేషన్ లోపాలను అధిగమించుటకు కె.సి.ఆర్.కిట్ పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలుచేస్తున్నది.