Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే జీవోలు విడుదల చేయాలి
- ఐదు ఫైనల్ నోటిఫికేషన్లనూ గెజిట్ చేయాల్సిందే
- కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి
- వలస కార్మికులకు రక్షణ కల్పించాలి
- కార్మికశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 75 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లో వేతనాలను సవరించాలనీ, ఫైనల్ చేసిన ఐదు నోటిఫికేషన్లను వెంటనే గెజిట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కనీస వేతనాల సలహా మండలి సభ్యులు భూపాల్ డిమాండ్ చేశారు. వలస కార్మికులకు కనీస రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని విజ్ఞప్తిచేశారు. వారానికి ఐదు రోజుల పనిని అమలు చేయాలని విన్నవించారు. కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని కార్మిక శాఖ కార్యాలయం(అంజయ్య భవన్) ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.వందలాది మంది కార్మికులు ధర్నాకు తరలొచ్చారు. ఈ ధర్నాకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్ అధ్యక్షత వహించగా...రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి, కార్యదర్శులు జె.వెంకటేశ్, బి.మధు, బి.ముత్యంరావు, ఎం.వెంకటేశ్, కె.ఈశ్వర్రావు, పి. శ్రీకాంత్, కూరపాటి రమేష్, రాష్ట్ర సీనియర్ నాయకులు పి. రాజారావు, నాయకులు జె. కుమార్, ఎం. చంద్రమోహన్, సాయిలు, పి. విష్ణు, జి. శ్రీనివాస్, కె. రాజయ్య, ఎల్లయ్య, చంద్రారెడ్డి, కల్లూరి మల్లేష్, వై. సోమన్న, ఎలక్ట్రిసిటీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ ఇ. గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ..కోర్టులో కేసులుండటం, యాజమాన్యాల అభ్యంతరాల వల్ల కనీస వేతనాల సవరణలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. వీలైనంత త్వరలో కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామనీ, సీఐటీయూ వినతిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అంతకు ముందు ధర్నానుద్దేశించి చుక్కరాములు, భూపాల్ మాట్లాడుతూ..రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించకపోవడం వల్ల కోటి మందికి పైగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు రెండుసార్లు కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేసి కార్మిక శాఖ ద్వారా ప్రతిపాదనలు తెప్పించుకొని పెండింగ్‌లో పెట్టడం దారుణమన్నారు. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదేండ్లకోసారి వేతనాలు సవరించాలన్నారు. రాష్ట్రంలో 15 ఏండ్ల నుంచి వేతనాలు సవరించలేదన్నారు. చట్ట ప్రకారం ఇప్పటివరకు కనీసం మూడు సార్లు కనీస వేతనాలు సవరించాల్సి ఉండేదన్నారు.
ఈ కాలంలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగాయనీ, వాటిని తట్టుకునే పరిస్థితి కార్మికులకు లేదని చెప్పారు. యజమానులు చెల్లించాల్సిన వేతనాలను ప్రభుత్వం నిర్ణయించకపోవడం వల్ల పరిశ్రమల యజమానులు విపరీతంగ లాభాలు పొందారని విమర్శించారు. 2021 జూన్‌లో ఐదు రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చారనీ, అన్‌స్కిల్డ్ వర్కర్‌కు మినిమం బేసిక్ రూ.18,019, వీడీఏ రేటు రూ.12 నిర్ణయించారని వివరించారు. ఆపై సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కార్మికులకు వేతనాలు పెంచినప్పటికీ గెజిట్ చేయకపోవడం వల్ల అమలు కావడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై యాజమాన్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తే మీటింగ్ పెట్టి కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారనీ, ఆ సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ప్రభుత్వమిచ్చిన ఐదు ఫైనల్ నోటిఫికేషన్లకు ఎటువంటి మార్పులు చేయకుండా గెజిట్ చేయాలని కోరాయని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమలోనూ దాదాపు 90 శాతం మంది కాంట్రాక్టు కార్మికులే ఉన్నారనీ, అందులోనూ అంతర్రాష్ట్ర కార్మికులే ఎక్కువ మంది ఉన్నారని వివరించారు. వారికి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ గానీ, 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం గానీ అమలు కావడం లేదని చెప్పారు. వారికి కనీస సౌకర్యాలు, హక్కులు కల్పించకుండా యజమానులు వెట్టిచాకిరి చేయిస్తున్న తీరును వివరించారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, ఉద్యోగ భద్రత ఇతర ఏ కార్మిక చట్టాలు అమలు కావడం లేదని వాపోయారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. కార్మిక శాఖ అధికారుల ద్వారా అన్ని పరిశ్రమల్లోనూ తనిఖీలు చేసి వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
8న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు సెలవు ఇవ్వాలి
సీఎస్‌కు తెలంగాణ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది. సోమవారం ఈ మేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వెంకటేశ్, జె.కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జె.కుమారస్వామి, ఉపాధ్యక్షులు పద్మశ్రీ వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఈ సెలవు వర్తించదనీ, సంబంధిత శాఖాధిపతులు సెలవు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న లక్షలాది మంది మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నిరాకరించడం అన్యాయమని వాపోయారు. ప్రపంచంలోని మహిళలందరూ సమానత్వం, సాధికారత కోసం హక్కుల దినాన్ని పాటిస్తున్న సమయాన వారిని భాగస్వాములను చేయకపోవడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి సెలవు మంజూరు చేయాలని కోరారు.