Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం పోరాటం..
- మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు
- సమానత్వ సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మిద్దాం' ఐద్వా సదస్సులో పీకే శ్రీమతి
- పాలకుల విధానాల ఫలితమే స్త్రీలపై దాడులు: మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డెబ్బైఐదేండ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం పోరాటాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షులు పీకే శ్రీమతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన 'సమానత్వ సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మిద్దాం' అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి మాట్లాడుతూ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలపై పీడన, దోపిడిలేని సమానత్వ సమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. మహిళల సాధికారత, సమానత్వం గురించి రోజూ అందరూ చెబుతున్నప్పటికీ..ఆచరణలో నేటికీ మహిళలపై వివక్ష, దాడులు నిత్యం జరగడం బాధగా ఉందన్నారు. మహిళలకు అన్ని రకాల వివక్షతలనుంచి విముక్తి కావాలంటే పోరాటమే ఏకైక మార్గమని చెప్పారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయిందనీ, ఈ కాలంలో మహిళల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని వివరించారు. రాజ్యాంగంపైన్నే దాడి జరుగుతున్నదనీ, ప్రజల మౌలిక హక్కులకు భంగం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల స్థానంలో మనుధర్మశాస్త్ర భావజాలంతో కూడిన విధానాలను ప్రతిష్టించాలని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని చెప్పారు. భారత రాజ్యాంగానికి పరిమితులున్నప్పటికీ..పనిభధ్రత, ఆహారభధ్రత, కనీస వేతనాలకు అవకాశంతో పాటు,వాటి సాధన కోసం పోరాటాలు నిర్వహించే కనీస ప్రజాస్వామిక హక్కులున్నాయని తెలిపారు. రాజ్యాంగ హక్కులకు లోబడే వరకట్న నిషేధ , గృహహింస వ్యతిరేక తదితర చట్టాలొచ్చాయని గుర్తుచేశారు. చట్టాలున్నా..వాటి అమలులో పాలకులు తమ పురుషాధిక్యతా భావజాలంలో భాగంగా అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. దీంతో పని ప్రదేశాల్లో వేధింపులు, లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామిక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదన్నారు. పాలక వర్గాలు తమ రాజకీయ అధికారాన్ని పదిల పర్చుకునేందుకు మహిళలను కేవలం ఓటు బ్యాంకులుగా మలుచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో సగభాగంగా ఉన్నప్పటికీ..చట్టసభల్లో 10శాతానికి మించి లేరని తెలిపారు. నిర్ణయాలు చేసే దగ్గర మహిళల ప్రాతినిధ్యం పెరిగాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనల్లో (యూపీఏ ప్రభుత్వ కాలంలో) బీజేపీ పార్లమెంట్ మహిళా సభ్యులు సానుకూలంగా మాట్లాడారనీ, ఇప్పుడు పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత కిమ్మనకుండా ఉండటంలో మహిళా సాధికారత పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల మూలంగా దేశంలో పేదలు దయనీయమైన జీవితాలను గడుపుతున్నారని చెప్పారు. బీజేపీ ఎనిమిదేండ్ల కాలంలో గ్యాస్ ధరలు రూ.450నుంచి రూ.1150 పెరగడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు ఉపయోగపడుతున్న ఉపాధిహామీ చట్టానికి నిధులు తగ్గించిందని గుర్తుచేశారు. ఇలాంటి మహిళా వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మహిళా లోకం పోరాడాలని పిలుపునిచ్చారు.
పెరుగుత్ను దాడులు..వేధింపులు.. టీ జ్యోతి
ఆధునిక కాలం అని చెప్పబడుతున్న నేటి సమాజంలో మహిళలపై దేశంలో రోజుకొక చోట లైంగిక వేధింపులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఐద్వా ఉపాధ్యాక్షులు టి జ్యోతి ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీని విలాస వస్తువుగా చూసే దుస్థితి నెలకొన్నదన్నారు. మను ధర్మశాస్త్రం స్త్రీలకు ఎలాంటి స్థానం కల్పించిందో, వారి పట్ల ఎలాంటి భావాన్ని కలిగి ఉందో..నేటికి అవే విధానాలు వారి పట్ల కొనసాగుతున్నాయని చెప్పారు. పురుషాధిక్యతా సమాజం మహిళనెప్పుడూ బానిసగానే చూస్తుందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులకు మాలాలను వెతకాలన్నారు. వాటిపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
భద్రతలేని బతుకు..మల్లు లక్ష్మి
ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం పేపర్లోనే కనిపిస్తున్నాయని చెప్పారు. రోజురోజుకు భద్రత కరవౌతున్నదన్నారు. బడికి పోయిన పాప తిరిగి ఇంటికి వచ్చే వరకు తల్లి ఆందోళనతో ఎదురు చూడాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొన్నదని చెప్పారు. ఎల్కేజీ చదువుతున్న చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. దేశం విద్యా, వైద్యం తదితర రంగాల్లో పొరుగు దేశాలకంటే వెనుకబడి ఉందన్నారు. స్త్రీలపై దాడుల్లో మాత్రం ముందున్నామని చెప్పారు. దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు చేపట్టడం తప్ప మూలాల్లోకి వెళ్లడం లేదని విమర్శించారు. మరోపక్క మహిళలు బయటకు రాకూడదని, దుస్తులు సరిగ్గా వేసుకోకపోవడం వల్లే ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయని మనువాద బీజేపీి కేంద్రమంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. 'భారతమాతకు జై' అన్నవారే స్త్రీలను కించపరచడం వారి రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతున్నదన్నారు. బీజేపీి పాలిత రాష్ట్రాలు హింసలో మొదటి వరసలో ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రతి గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు, ప్రతి పది నిమిషాలకు ఒక కిడ్నాప్ జరుగుతున్నదని వివరించారు. ఉన్న మహిళా రక్షణ చట్టాలను తగిన రీతిలో అమలు చేయకుండా నీరుకారుస్తున్నారని తెలిపారు. ఆధునిక స్త్రీ చరిత్రను తిరిగి రాస్తుందన్న గురజాడ మాటలు నిజం కావాలనీ, మహిళలు, విద్యార్థులు, మేధావులు, అభ్యుదయవాదులు కలసికట్టుగా హింస లేని సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి, కార్యదర్శి బుగ్గవీటి సరళ, కెఎన్ ఆశాలత, నాగలక్ష్మి ప్రసంగించారు. శశికళ, వినోద, విమల, లక్ష్మమమ్మ తదితరులు పాల్గొన్నారు.