Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో బీజేపీ ఓటమితో వామపక్షాలకు మరింత ఆదరణ
- వీర తెలంగాణ గడ్డలో మతోన్మాదులకు స్థానం లేదు
- విభజన హామీలను అమలు చేయని మోడీ ప్రభుత్వం
- గిరిజనులు, దళితుల హక్కులు కాలరాస్తున్న కేంద్రం
- అటవీ హక్కుల చట్ట సవరణతో జీవనాధారం మీద దాడి
- జనాన్ని చైతన్యం చేయడం దేశాన్ని రక్షించడమే మా లక్ష్యం
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
'తెలంగాణలో కమ్యూనిస్టులకు పూర్వవైభవం తెస్తాం. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత వామపక్షాలకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. రాష్ట్రాన్ని మతోన్మాద శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిన ఈ గడ్డలో మతోన్మాదులకు స్థానం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లవుతున్నా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అప్రజాస్వామిక విధానాలు, మతోన్మాద చర్యలు, విద్వేషాలు పెంచి రాజకీయ ప్రయోజనాలు పొందే అంశాలను ప్రజలకు వివరిస్తాం. వారిలో చైతన్యం పెంపొందించి దేశాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం'అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. సీపీఐ(ఎం) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనచైతన్య యాత్ర నేపథ్యంలో పోతినేని సుదర్శన్ నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
కమ్యూనిస్టుల ప్రాబల్యం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపడుతున్నారు. దీనిద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నది. వాటిని ప్రజలకు చెప్పి చైతన్యపరచడమే ఈ యాత్ర లక్ష్యం. దేశంలో ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతున్నది. మతసామరస్యానికి, సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతున్నది. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది. సీపీఐ(ఎం) బలంగా ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నాం. కమ్యూనిస్టులు బలంగా ఉన్న జిల్లాలున్నాయి. అక్కడున్న ప్రజలను చైతన్యపరిచే బాధ్యత మాపై ఉన్నది.
మునుగోడులో బీఆర్ఎస్ విజయంతో కమ్యూనిస్టుల బలం మరోసారి రుజువైంది. దీన్ని నిలబెట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికలతో ప్రజల ముందుకెళ్తున్నారు? కమ్యూనిస్టులకు పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారా?
కచ్చితంగా వస్తుంది. అయితే ఈ యాత్ర ద్వారా మాత్రమే వస్తుందని మేం భావించడం లేదు. మునుగోడు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అన్నట్టుగా కమ్యూనిస్టుల ప్రాధాన్యతను ప్రతిఒక్కరూ గుర్తించక తప్పదు. మాకు ఎదురులేదు, ఏమైనా చేయగలమని భావించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలను తెచ్చింది బీజేపీ. గెలుస్తామంటూ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మా రాజకీయ విధానం ప్రకారం అక్కడ బీజేపీని ఓడించాం. బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినపుడు ప్రజల్లో కొంత అసహనం వ్యక్తమైంది. కానీ ఫలితాల తర్వాత సీపీఐ(ఎం) వైఖరి సరైందేనని సానుకూల వాతావరణం వచ్చింది. సీపీఐ(ఎం) ఇతర వామపక్షాల కృషి ఫలితంగా ఈ రాష్ట్రంలో మతోన్మాదులకు స్థానం లేకుండా పోయింది.
హిందూత్వ పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీన్ని ఎలా నిలువరిస్తారు?
ఆర్ఎస్ఎస్, బీజేపీ చాపకింద నీరులా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ బహిరంగంగా మతోన్మాద ధోరణిని అవలంభిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తలకెక్కిన హిందూ మతోన్మాదానికి పరాకాష్ట. ప్రజల డబ్బుతో అంబేద్కర్ పేరుతో నిర్మించిన సచివాలయాన్ని గుమ్మటాలను కూలుస్తామంటున్నారు. మతతత్వం, ఉన్మాదాన్ని బయటపెడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. కానీ మతం పేరుతో ప్రజలను విభజించి రాజకీయంగా లబ్ధిపొందాలని భావిస్తున్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిన గడ్డ ఇది. టీచర్ మల్లిఖార్జున్, హేతువాది భైరి నరేష్‌పై దాడులు జరుగుతున్నాయి. అధికారంలోకి వస్తే యూపీ తరహాలో తెలంగాణలోనూ బుల్డోజర్లను తెస్తామంటున్నారు బండి సంజరు. దీన్ని ప్రజలకు వివరిస్తాం. లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని మన ప్రజలు గౌరవిస్తారు. ఈ ప్రాంతంలో మతోన్మాద చర్యలకు ఆస్కారముండదు. జనాన్ని చైతన్యం చేయడం, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఈ యాత్ర. ఆర్ఎస్ఎస్ మతోన్మాద చర్యలను ఎండగడతాం. తెలంగాణ సమాజం నుంచి వారిని వేరుపరిచి బలహీనపరుస్తాం.
సీపీఐ(ఎం), ఇతర వామపక్షాల ఆధ్వర్యంలో భూపోరాటాలు, ఇండ్ల స్థలాల పోరాటాలు ఊపందుకున్నాయి. పేదలు పెద్ద సంఖ్యలో కదులుతున్నారు కదా?
ఇల్లు, తిండి, బట్ట, ఉపాధి వంటి అంశాలు మా యాత్రలో ప్రస్తావిస్తాం. వేలాది మంది ఇండ్లు లేని పేదలు 50, 40, 30 గజాల్లో గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ఈ సమస్యలను పట్టించు కోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించాలని కోరతాం.
భూపోరాటాలు, ప్రజా సమస్యలపై బీజేపీ వైఖరి ఎలా ఉంది. పేదల పక్షాన నిలుస్తున్నదా? కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలే ప్రజలపై దాడులు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి కదా?
బీజేపీకి ఈ సమస్యల గురించి ఆలోచనే లేదు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పేదల సమస్యలను ప్రస్తావించలేదు. వాళ్లు కూర్చోవడానికి అసెంబ్లీలో గది కావాలన్నారు. పేదలు, కౌలు రైతులు, పోడు రైతుల సమస్యలను ప్రస్తావించలేదు. గుడిసెలు వేసుకున్న పేదలపై బీజేపీ నాయకులు కొన్ని ప్రాంతాల్లో దాడి చేస్తున్నారు. పెత్తందార్లకు అండదండగా ఉన్నారు. దేశంలో అంబానీ, అదానీలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉన్నది. సమస్యలను పట్టించుకోకుండా అధికారం కోసం ప్రజల మధ్య మతం ప్రాతిపదికన చీలికలు తెస్తున్నారు. తద్వారా రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. విభజన హామీలను అమలు చేయడం లేదు. ప్రజల్లో బీజేపీ తీరు పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నది.?
చట్ట ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలు, అభివృద్ధిని విస్మరించడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీల్లో ఉన్నది. పదేండ్లు పూర్తవుతున్నది. గిరిజన విశ్వవిద్యాలయం వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక సాకు చూపి తప్పించుకునే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. దీనిపట్ల మహబూబాబాద్, ములుగు, భద్రాచలం జిల్లాల్లోని ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. దక్షిణ తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలి. దాని ప్రస్తావనలేదు. మతం మారిన గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు వర్తించబోవంటూ ఓ బీజేపీ నాయకుడు కరపత్రం వేశారు. దానివల్ల గిరిజనుల్లో విభజన తేవాలని ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదు. చట్టప్రకారం హామీ ఉన్నా అమలు చేయడం లేదు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పెద్ద కార్యక్రమం చేశాం. పాదయాత్ర నిర్వహించాం. 800 కేంద్రాల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిరసనలు చేపట్టాం. రక్షణ స్టీల్ సంస్థకు కట్టబెట్టాలని వైఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎండగట్టాం. తెలంగాణ పట్ల బీజేపీ వివక్షను చూపిస్తున్నది.
పోరాటాల గడ్డ తెలంగాణలోకి ప్రవేశించేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ఏంటీ? వాటిని తిప్పికొట్టేందుకు మీ ముందున్న ప్రణాళికలు ఏంటీ?
దేశంలో అధికారాన్ని ఉపయోగించుకుని విస్తరించాలని భావిస్తున్నారు. ప్రజలను మతం పేరుతో విభజించాలని చూస్తున్నది. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసి విస్తరించాలని అనుకోవడం లేదు. ఈడీ, ఐటీ, సీబీఐ, ఈసీని దుర్వినియోగం చేస్తున్నది. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఈ రకంగా ఇక్కడ చొరబడాలని చూస్తున్నది. అది సాధ్యం కాదు. కమ్యూనిస్టులతోపాటు ఇతర లౌకిక, ప్రజాతంత్ర, అభ్యుదయ, సామాజిక శక్తులను కూడగడతాం. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను వివరించి వెనక్కి కొట్టే పనిచేస్తాం.
పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో ఏడు మండలాలను ఏపీలో కలపడంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటున్నారు. వాస్తవాలేంటీ?
మోడీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ మొదటి ఆర్డినెన్స్‌ను తెచ్చారు. దేశ అవసరాలరీత్యా కలపలేదు. పోలవరం ప్రాజెక్టు నీటి ముంపునకు ఆ ప్రజలను ఎరవేయడం. ఆర్డినెన్స్ అంటే ఆ ప్రజల ఉరితీత. ముంపు లేకుండా ధర్మారావు, విద్యాసాగర్, హనుమంతరావుతో సంప్రదించి ప్రత్యామ్నాయం గురించి వివరించాం. ప్రజలను కాపాడే డిజైన్‌ను చూపెట్టాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలను ముంచే పని చేసింది. భద్రాచలం పట్టణంలో 71 అడుగుల నీటిమట్టం వస్తే ఎలాంటి ముంపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు 55 అడుగులు వస్తేనే ముంపునకు గురవుతున్నది. ప్రజలకు మంచిచేసే పార్టీగా సీపీఐ(ఎం) ఉన్నది. ప్రజలను ముంచే పార్టీగా బీజేపీ ఉన్నది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.
పోడు భూముల పంపిణీ, కేంద్రం ఇచ్చిన గిరిజన చట్ట సవరణ, ఆదివాసీ గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలను పెండింగ్‌లో ఉంచడం గురించి వివరించండి?
బీజేపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు తీవ్ర వివక్షతో మనువాద ధోరణితో వ్యవహరిస్తున్నది. 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తామంటున్నది. 2011ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2021 జనగణన చేపట్టలేదు. అది చేస్తే ఎస్సీ,ఎస్టీల జనాభా పెరుగుతుంది. అప్పుడు రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని అది చేయడం లేదు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. బీసీ గణన చేయాలని కోరింది. వాటి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బీజేపీ మందబలంతో అటవీ హక్కుల చట్టాన్ని సవరించింది. అటవీ పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది. గిరిజనులకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నది. దళితులు, గిరిజనుల్లో ఒకరికి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టామని చూపి రాజకీయ లబ్ధిపొందు తున్నారు. వారి జీవనాధారాలమీద దాడి చేస్తున్నారు. హక్కులను హరిస్తున్నారు. మూల వాసులుగా ఉన్న గిరిజనులను ప్రజలుగా గుర్తించడం లేదు. కొమురంభీం, సోయం గంగులు, కుంజా బొజ్జి వంటి వీరయోధులున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను గుర్తిస్తున్నారు. పోడు భూములు, రిజర్వేషన్లు, హక్కులను కాపాడాలి. ఈ అన్ని విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లి చైతన్యపరుస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం.