Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ప్రకటించిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ - బోనకల్
ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ పది రోజులుగా నీటిపారుదల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో రైతులు బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట 24 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్ బ్రాంచి కెనాల్ పరిధిలోనే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులోని చివరిగా ఆళ్ళపాడు మైనరు ఉంది. దీని కింద మండల పరిధిలోని ఆళ్లపాడు, గోవిందాపురం(ఏ) గ్రామాలు చివరి భూములుగా ఉన్నాయి. ఆళ్లపాడు గ్రామానికి చెందిన అన్నదాతలు 1,446 ఎకరాలు, గోవిందాపురం(ఏ) లో 141 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట కంకి వేసే దశలో ఉంది. అయితే సాగునీరు అందితే తప్ప పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తామని చెప్పటం ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలివేయటం ఒక తంతుగా మారింది. దాంతో అన్నదాతలు మంగళవారం నీటిపారుదల శాఖ మండల కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షను సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. సాగర్ డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నప్పటికీ నీటిపారుదల శాఖ, ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని ఏ కాలవకు సాగర్ నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల కలకోట, నారాయణపురం, ఆళ్లపాడు తదితర కాలవుల కింద సాగుచేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయని తెలిపారు. పంటలను కాపాడుకునేం దుకు అన్నదాతలు ఆందోళనకు దిగినా వారబందీ పేరుతో పంటలను అధికారులు ఎండబెడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న నిరాహార దీక్షకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆళ్ళపాడు, గోవిందాపురం ఏ సర్పంచ్‌లు మర్రి తిరుపతిరావు భాగం శ్రీనివాసరావు, రైతులు ఆళ్ల వీరబాబు, బెజవాడ నరేష్, మరీదు గోపి, బెజవాడ ధనమూర్తి, కంసాని నాగేశ్వరరావు, తెల్లబోయిన శ్రీను, మల్లాది వెంకటేశ్వర్లు, గండమాల రాయప్ప ఆ రెండు గ్రామాలకు చెందిన అన్నదాతలు పాల్గొన్నారు.
15 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశా : అల్లిక కబ్బయ్య, రైతు ఆళ్లపాడు
ఆళ్ళపాడు మైనర్ కింద పది ఎకరాల్లో కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశా. పది ఎకరాలను ఎకరం రూ. 15,000 చొప్పున కౌలుకి తీసుకున్నాను. ముందుగానే రైతుకు కౌలు చెల్లించాను. నా సొంత పొలం మరో 5 ఎకరాల్లో కూడా మొక్కజొన్న పంటనే సాగు చేశాను. మొత్తం 15 ఎకరాలకు గాను రూ.4.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. మొత్తం అప్పు తీసుకువచ్చే పెట్టుబడి పెట్టాను. మరికొంత నా భార్య పుస్తెలతాడును బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చా. కానీ సాగర్ నీటిని విడుదల చేయకపోవడం వల్ల 15 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట మొత్తం ఇప్పటికే సగానికి పైగా ఎండిపోయింది. ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము సాగుచేసిన మొక్కజొన్న పంట ఎండిపోతుంది.
రైతులతో చర్చలు జరిపిన డీఈ నాగ బ్రహ్మయ్య
మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ సబ్ డివి జన్ కార్యాలయం ఎదుట అన్నదాతలు దీక్షకు చేపట్టగా బోనకల్ సబ్ డివిజన్ ఇన్చార్జి డీఈ వల్లపు నాగ బ్రహ్మ య్య రెండు గంటలకు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. పైనుంచి ఒక్కొక్క తూము ను బంద్ చేసుకుంటూ వస్తున్నామని మంగళవారం రోజే ఆళ్ళపాడు మైనర్‌కు పూర్తిస్థాయిలో సాగర్ నీటిని విడుదల చేస్తామని ఆందోళన విరమించాలని కోరారు. అందుకు రైతులు నిరాకరించారు. ముందుగా ఆళ్ళపాడు మైనర్‌కు సాగర్ నీటిని విడుదల చేసిన తర్వాతే తమ ఆందోళన విరమిస్తామని, అప్పటివరకు మీ మాయ మాటలు నమ్మి మా పంటలను ఎండబెట్టుకోలేమని స్పష్టం చేశారు. దాంతో చేసేదేమీ లేక డీఈ అక్కడ నుంచి వెళ్లిపోయారు.