Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
త్రిపురలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు జర్నలిస్టులపై దాడిచేయడాన్ని ఐఎఫ్డబ్యూజే, టీడబ్ల్యూజేఎఫ్, ఎన్ఏజే, ఎపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ఎన్నికల అనంతరం అకారణంగా స్థానిక జర్నలిస్టులు, ప్రజలపై దాడిచేయడం దారుణమని వ్యాఖ్యానించాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే అహంకారంతోనే జర్నలిస్టులపై దాడులు చేయడం అన్యాయమనీ, మూక దాడులపై విచారణ చేయాలని డిమాండ్ చేశాయి. త్రిపుర రాజధాని అగర్తలలోని శ్రీపల్లిలో ప్రముఖ జర్నలిస్ట్ సమీర్ధర్పై బీజేపీ మూక భౌతికదాడి చేసి భయపెట్టాలని చూడడటం నీతి మాలిన చర్యగా అభివర్ణించాయి. అలాగే 'ప్రొతిబడి కోలోం' అనే స్థానిక దినప త్రికలో పనిచేస్తున్న మరో జర్నలిస్టు ఇంటిపైనా దాడిచేయడం అమానుషమని విమర్శించాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లా వ్యవహరిస్తూ మూక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈమేరకు ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి.ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య ఎన్ఏజే నేషనల్ సెక్రెటరీ జనరల్ ఎన్.కొండయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మంగళవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.