Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు రూపంలోకి మారుతున్నదని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయల సుభాష్‌చంద్రబోస్ ఏడో వర్ధంతి సందర్భంగా 'ఫాసిస్టు ప్రమాదంలో భారతదేశ ప్రజాస్వామ్యం'అనే అంశంపై ఈనెల పదో తేదీన ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్‌లో సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, భార్గవ, రమేష్ పట్నాయక్, దేవి, సతీష్‌చందర్ తదితరులు ప్రసంగిస్తారని వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఫైనాన్స్ క్యాపిటల్ అవసరాల కోసం రహస్య ఎజెండాను అమలు చేయడానికి పూనుకుంటున్నాయని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ, ప్రతిపక్షాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని తెలిపారు. మనువాద రాజ్యాంగం అమలుకు ప్రయత్నాలను ఆరంభించిందని పేర్కొన్నారు. ప్రశ్నించే మేధావులు, పార్టీల నాయకులు, వ్యక్తులు, సంస్థల ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని కోరారు.