Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం ఆస్తుల కోసమే మెట్రో నిలిపివేత
- ట్రైబల్ మ్యూజియానికి భూములివ్వట్లేదు : కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రాష్ట్ర సర్కారు సహకరించట్లేదని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ట్రైబల్ యూనివర్శిటీ డీపీఆర్ కోసం కేంద్రం కోటి రూపాయలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమిని చూపడం లేదని చెప్పారు. జేబీఎస్, ఫలక్ నుమా మెట్రో కోసం కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చిందన్నారు. ఎంఐఎం నేతల ఆస్తులను రక్షించడం కోసమే ఫలక్ నుమా మెట్రోను అడ్డుకున్నారని ఆరోపించారు. ఘట్కేసర్, యాదాద్రి వరకు ఎంఎంటీస్ విస్తరణ కోసం భూములివ్వడం లేదనీ, ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చెప్పారు. జనం రాసే ఉత్తరాలకు తాము సమాధానం చెబుతామనీ, తమ ఉత్తరాలకు సమాధానం చెప్పే సంస్కారం కేసీఆర్కు లేదని విమర్శించారు. రామగుండం, బీహెచ్ఈఎల్ ,శంషాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రులు నిర్మిస్తామని పదే పదే లేఖ రాసినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. తెలంగాణలో నూతన రైల్వే లైన్ల నిర్మాణం, రద్దీ ప్రాంతాల్లో డంబ్లింగ్, ట్రిప్లింగ్, ఎలక్ట్రిషన్ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామనీ, అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.720 కోట్లు కేటాయించామనీ, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర సర్కారు సహకరించకపోవడం వల్లనే రైల్వే లైన్ల పనులు నెమ్మదించాయని తెలిపారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం భూములను కేటాయించాలని కోరారు. వరంగల్లో రైలు వ్యాగన్ల వర్క్షాపు ఏర్పాటు చేయబోతున్నామనీ, 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.