Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో నేడు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహిళా ఆరోగ్య రక్షణకై 'ఆరోగ్య మహిళ'ను తెలంగాణ రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మార్చి 8వ తేదీన ప్రారంభించనున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఉదయం 10.15 గంటలకు కరీంనగర్ పట్టణంలోని బుట్టిరాజారాం కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే సమయంలో 25 జిల్లాల్లోని 100 కేంద్రాల్లో జరిగే ప్రారంభ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రతి మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే అవసరమైన వారికి మందులు ఇవ్వడంతోపాటు రెఫరల్ ఆస్పత్రులకు పంపిస్తారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సరైన ఆహారం లేకుండా వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మోనోపాజ్ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెస్ట్రువల్ సమస్యలు, సుఖ వ్యాధులు, తక్కువ బరువు ఉన్న సమస్యలకు సంబందించిన వైద్య పరీక్షలను చేస్తారు. వీటితోపాటు, బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే అందచేస్తారు. మహిళల్లో క్యాన్సర్ వ్యాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ వ్యాధికి నిర్దారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానా లలో 30 ఏండ్ల పైబడ్డ మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేపడుతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మామోగ్రామ్. కల్పోస్కోపి, కీమోథెరపి, బయాప్సి, పాప్ స్మియర్ పరీక్షలను అందుబాటులో ఉంచారు. నిర్దారిత క్యాన్సర్ మహిళలకు హైదరాబాదులోని నిమ్స్, ఎం.ఎం.జె క్యాన్సర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారు.