Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోరాహోరీగా పిడిగుద్దులాట
- హున్సాలో తలపడ్డ గ్రామస్తులు
నవతెలంగాణ-బోధన్
ఇసుక వేస్తే రాలని ప్రజానీకం.. ఎప్పటిలాగే అదే ఉత్కంఠ.. అదే పిడిగుద్దులాట.. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హూన్సా గ్రామంలో హౌలీ పండుగ సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పిడిగుద్దులాట ఉత్కంఠ మధ్య కొనసాగింది. సాయంత్రం కుస్తీ పోటీల అనంతరం 6 గంటల తర్వాత గ్రామం నడిబొడ్డున ఏర్పాటుచేసిన పెద్ద దుంగలకు గట్టి తాడును కట్టి ఆట ప్రారంభించారు. ముందుగా డప్పుల చప్పుళ్లతో కుల సంఘాల పెద్దలను ఆట స్థలానికి ఆహ్వానించారు. చివరగా అందరూ చేరుకున్నారని నిర్దారించగానే తాడును ఒక చేతితో పట్టుకుని ఒక్కసారిగా మరో చేతితో ధన్ధన్ అంటూ కొట్టుకోవడం ప్రారంభించారు. 10 నిమిషాల పాటు ఎవరిని ఎవరు కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొందరికి గాయాలైతే మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆట ముగియగానే ఒకరికొకరు స్నేహభావంతో ఆలింగనం చేసుకుని హౌలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం పెద్ద వారిని గౌరవ సూచికగా భుజాలపై ఎత్తుకుని కల్లు దుకాణాలకు బయలుదేరారు. కాగా పిడిగుద్దులాటను చూసేందుకు చుట్టుపక్క ప్రాంత వాసులే కాకుండా.. దూర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలిరావడంతో హున్సా గ్రామం కిక్కిరిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.