Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానేరు వాగులో మునిగి ముగ్గురు బాలురు మృతి
నవతెలంగాణ-తిమ్మాపూర్
అప్పటి వరకు ఆనందంతో రంగులు చల్లుకుంటూ హోలీ ఆడిన చిన్నారులు సాయంత్రానికల్లా విగత జీవులయ్యారు. పండుగ పూట వారి కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సదాశివపల్లి వద్ద తీగల వంతెన సమీపంలో మానేరు వాగు వద్దకు ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు. తీగల వంతెన వద్ద పనులు చేయడానికి వచ్చిన ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన కొంతమంది కూలీలు.. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. ఆయా కూలీల పిల్లలు వీరాంజనేయులు (12), సంతోష్ (14), అనిల్ (13) ముగ్గురు హోలీ ఆడి స్నానం చేయడానికి తీగల వంతెన సమీపంలోని అలుగునూరు మానేరు వాగుకు వచ్చారు. అనంతరం అందులోకి దిగగా.. రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో ముగ్గురు బాలురు పడి మృతి చెందారు. గమనించిన అక్కడ పని చేస్తున్న కూలీలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు మృతి చెందిన కొడుకుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మానేరు తీరాన సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ కర్ణాకర్ రావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.