Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుడు మృతి
- రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో దారుణం
నవతెలంగాణ-శంకర్పల్లి
పెట్రోల్ పంపులో పనిచేసే ఇద్దరు కార్మికులపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటనలో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ హెచ్‌పీ పెట్రోల్ పంపులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. నార్సింగ్ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం జన్వాడ గ్రామ సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పొద్దుటూరు గ్రామానికి చెందిన నక్క సంజరు(19), బీహార్‌కు చెందిన మరో యువకుడు పనిచేస్తున్నారు. జన్వాడ గ్రామానికి చెందిన టంగుటూరు నరేందర్, మద్దూరు మల్లేష్, అంతిగళ్ళ అశోక్ ముగ్గురు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి కారు తీసుకుని పెట్రోల్ బంక్‌కు వచ్చారు. పెట్రోల్ పోసిన యువకుడు డబ్బులు అడగగా.. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు స్వైపింగ్ మిషన్ ఉందా అని అడగటంతో అది పనిచేయడం లేదని కార్మికుడు బదులిచ్చాడు. తమ దగ్గర లిక్విడ్ అమౌంట్ లేదని చెప్పడంతో ఏ విధంగానైనా డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టారు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఆ ముగ్గురు ఆ యువకుడిపై దాడి చేశారు. గమనించిన క్యాషియర్ నక్క సంజరు అక్కడికి వచ్చి స్వైపింగ్ మిషన్ పనిచేయడం లేదు.. డబ్బులివ్వాలని అడిగాడు. వారు కోపానికి గురై అతనిపై కూడా దాడికి పాల్పడటంతో కింద పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం వెంటనే నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ సీఐ తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న పొద్దుటూరు గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు. హెచ్‌పీ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న మృతుడు నక్క సంజరు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ యాజమాన్యంతో మిర్జాగూడ, జన్వాడ గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడారు. దాంతో పెట్రోల్ బంక్ యాజమాన్యం బాధిత కుటుంబానికి రూ.5.50 లక్షలు నష్టపరిహారం అందజేయడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.