Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కోటా అభ్యర్ధుల్ని ప్రకటించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనమండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటించింది. ఈ పేర్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఖరారు చేశారు. తొలిసారిగా దేశపతి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అలాగే కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. గురువారం వీరు ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాటు చూడాలని సీఎం కేసీఆర్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. గవర్నర్ కోటాలోని మరో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కష్ణారెడ్డిల పదవీకాలం ముగిసింది. దీనితో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసి, పదవీకాలం ముగిసిన నవీన్‌కుమార్‌కు మాత్రమే సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ఓస్డీగా పనిచేస్తున్న దేశపతి శ్రీనివాస్‌కు ఈసారి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దేశపతిని ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ పలు కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. మరో ఎమ్మెల్సీగా ఎంపికైన చల్లా వెంకట్రామిరెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమడు. ఆయన ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. పార్టీ దేశవ్యాప్త విస్తరణలో ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వెంకట్రామిరెడ్డికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్న భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్‌కు నిరాశ మిగిలింది. అయితే గవర్నర్ కోటాలో ఎంపిక చేసే పేర్లలో తాము ఉండొచ్చనే ఆశాభావాన్ని ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ కోటా కింద గతంలో పాడి కౌశిక్ రెడ్డి పేరును మంత్రివర్గ ఆమోదించి, గవర్నర్‌కు సిఫార్సు చేసినప్పుడు ఆమె పున్ణపరిశీలన చేయాలని ఫైల్‌ను తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా అభ్యర్ధుల విషయంపై ఆచితూచి వ్యవహరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఆ అభ్యర్ధుల పేర్లను నేరుగా ప్రకటించకుండా, మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదం తీసుకొని వెల్లడించాలని భావిస్తున్నట్టు తెలిసింది.