Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ఆకాంక్ష
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పురుషుడితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వమైన విజయాలు నారీశక్తిని చాటుతున్నాయని సీఎం అన్నారు. మంగళవారం ఈమేరకు సీఎం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు అన్నిరంగాల్లో పురోగమించిన నాడే దేశాభివద్ధి సంపూర్ణమవుతుందని ఆకాంక్షించారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవత్ణా' అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరముందని తెలిపారు. స్త్రీశక్తి చాటే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నదని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు మహిళలకు ప్రత్యేక సెలవును మంజూరు చేసి మహిళలను సమున్నతంగా గౌరవించుకుంటున్నామని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధ్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని సీఎం తెలిపారు.
ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికిరెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటున్నదని సీఎం వివరించారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం వివరించారు.