Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ మొదలు కుక్కల నియంత్రణ వరకు
- రోడ్ల నిర్వహణ సైతం
- బల్దియా ఆదాయానికి గండి
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పెద్ద మున్సిపల్ కార్పొరేషన్. కోటిన్నరకుపైగా జనాభా ఉంది. రూ.6వేల కోట్లకుపైగా బడ్జెట్. నగరవాసులు ఆస్తిపన్ను, సీవరేజ్ పన్ను, పలురకాల పన్నులు చెల్లిస్తున్నారు. అందుకనుగుణంగానే బాధ్యతగా జీహెచ్ఎంసీ సేవలందించాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్క సేవలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తోంది. జనన, మరణ ధృవపత్రాల జారీ మొదలుకుని కుక్కల నియంత్రణ వరకు ప్రయివేటు సంస్థలకు అప్పగించారు. చెత్త నిర్వహణ, రోడ్ల నిర్వహణను సైతం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టారు. ఫలితంగా ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలన్నీ ఖరీదయ్యాయి. అందులో భాగంగానే అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి.
బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
జనన, మరణాల సర్టిఫికెట్ల జారీ ప్రయివేటుపరం చేశారు. పుట్టిన ప్రతి బిడ్డకూ జనన ధృవీకరణ పత్రం ఇవ్వాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి) ప్రాంతాల్లో ఈ బాధ్యతను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. కానీ, అవినీతి సాకుతో ఈ సేవలను ప్రయివేటుపరం చేశారు. దీంతో బల్దియా ఖజానాకు ఏటా సుమారు రూ.3 కోట్ల నష్టం. సిటిజన్ సర్వీస్ సెంటర్లో రూ.20 చెల్లిస్తే ధృవపత్రం జారీ చేసేవారు. ఈ బాధ్యతను మీసేవా కేంద్రాలకు అప్పగించారు. సర్టిఫికెట్‌కు ఎంత వసూలు చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. నిధుల్లేక అసలే ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీ అక్షరాల రూ.3.15 కోట్ల నష్టం మూటగట్టుకొంటుంది. ఏటా గ్రేటర్ కార్పోరేషన్ పరిధిలో జనన ధృవపత్రాలు 1.50 లక్షలు, మరణ ధ్రువపత్రాలు 60 వేల వరకు ఉంటున్నాయి. ఇందులో జనన ధృవపత్రాలను సరాసరిగా మూడు చొప్పున, మరణ ధృవపత్రాలు వివిధ అవసరాలైన ఇన్సూరెన్స్, బ్యాంకు, ఆస్తి తగాదాల్లోనూ తప్పనిసరైంది.
అక్రమాలకు ఊతం
జనన, మరణ ధృవపత్రాలు జారీచేసే విధానాన్ని ప్రయివేటుకు ఇచ్చిన తర్వాతనే అక్రమాలు పెరిగాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో మార్పులు చేశారు. అయినా ఫేక్ సర్టిఫికెట్ల దందా ఆగడం లేదు. అక్రమాలు జరిగాయని 31వేల నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్లను రద్దు చేయడం ఇందుకు నిదర్శనం. సరైన సర్టిఫికెట్లు లేకున్నా జనన, మరణ ధృవపత్రాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సేవలను ప్రయివేటుకు ఇవ్వడంతో బల్దియా ఖజానాకు నష్టంతోపాటు ప్రజలపైనా భారంగా మారింది. పైగా అక్రమాలకు ఊతమిచ్చేవిధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.
కుక్కల నియంత్రణపైనా..
గ్రేటర్లో కుక్కల నియంత్రణ కార్యక్రమాన్ని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టారు. ఒక్కో కుక్కకు రూ.1500 చెల్లిస్తున్నారు. కుక్కల బర్త్ కంట్రోల్‌తోపాటు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అయినా కుక్కల నియంత్రణ నామమాత్రంగానే ఉంది. ఫలితంగా అంబర్‌పేట్‌లో బాలున్ని కుక్కలు చంపిన విషయం తెలిసిందే. నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. జీహెచ్ఎంసీలో పరిధిలో అధికారుల చెప్పిన లెక్కల ప్రకారం 2021లో 4,61,145 కుక్కులు, 2022లో 5లక్షలు, 2023లో సుమారు 5లక్షలకుపైగానే కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో 75శాతం కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయినట్టు మేయర్ ప్రకటించారు. 2021లెక్కల ప్రకారం 4,61,145 కుక్కులు ఉన్నాయని, వాటిలో 1,99,182 కుక్కలకు ఆపరేషన్లు చేసినట్టు, మరో 2,61,963కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అంటే తప్పుడు లెక్కలతో నిధులు కాజేస్తున్నారు.
రెండున్నర గంటలపాటు కమిషనర్, ఉన్నతాధికారులతో మేయర్ సమీక్ష
ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఏం జరిగిందన్న అంశంపై కమిషనర్ లోకేష్ కుమార్, ఉన్నతాధికారులతో మేయర్ గద్వాల విజయలక్ష్మి బుధవారం రెండున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సీఎంహెచ్వో, స్టాటస్టికల్ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్డీవో ప్రొసీడింగ్ లేకుండా మంజూరైన 21 వేల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్టను తాము గుర్తించినట్టు తెలిపారు. రద్దు చేసిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తుదారులకు నోటీసులు ఇస్తాం అన్నారు. వీరందరికీ త్వరలో మొబైల్ ద్వారా సమాచారం ఇస్తామని చెప్పారు. వారు తమ పేపర్లను మళ్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. 15 మీ సేవ కేంద్రాల్లో ఈ విధమైన సర్టిఫికెట్లు అప్లోడ్ అయినట్టుగా గుర్తించామని.. మీసేవ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బర్త్ అండ్ డెత్ విభాగంలో 12 మంది ఆపరేటర్ల నియామకం రోస్టర్ విధానాల్లో జరగలేదని చెప్పారు. సీఎంహెచ్వో స్టాటస్టికల్ అధికారులకు ఇంటర్వ్యూ చేసే అధికారం లేదని.. దానిపై విచారణ చేస్తామని తెలిపారు. 2021 జులై నుంచి ఆన్లైన్ విధానం ప్రారంభించిన తర్వాత నాలుగు లక్షల 30 వేలకు పైగా భర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేశామని వివరించారు.
ఉచిత సేవలు బల్దియా బాధ్యత
సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్
ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీపై ఉచిత సేవలందించాల్సిన బాధ్యత ఉంది. బర్త్, డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్సెంటర్లలో కూడా జారీచేయాలి. 31వేల నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్ల రద్దుకు జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.