Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులకు కూడా ఓటు హక్కు కల్పించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. బుధవారం ఈ మేరకు హైదరాబాద్లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో రీజనల్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) అనిల్ కుమార్ సాహుకు వినతిపత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు అందజేశారు. సింగరేణిలో ఉత్పత్తితో సహా అన్ని విభాగాలలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని సాహు దృష్టికి తీసుకెళ్లారు. వారికి ఓటు హక్కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 13న జరిగే కార్మిక సంఘాల సమావేశానికి సింగరేణిలోని కాంట్రాక్టు కార్మిక సంఘాలను కూడా పిలవాలని కోరారు. సింగరేణిలో పర్మినెంట్ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్), ఏటీయూసీి, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ తదితర పర్మినెంట్ కార్మిక సంఘాల నాయకులు కూడా కాంట్రాక్టు కార్మికులకు ఓటు హక్కు కల్పించే అంశంపై తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న జరిగే సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల ఓటు హక్కు కోసం మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.