Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
- విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు బుధవారం ముట్టడించారు. రాష్ట్రంలో 15 వేల ఉపాద్యాయ ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి త్వరగా టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. వాటితో సంబంధం లేకుండా వెంటనే 15 వేల ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ను తక్షణమే జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. గతేడాది జూన్ 12న టెట్ నిర్వహించి 10 నెలలు గడిచిపోయిందన్నారు. ఇప్పటి వరకు టీఆర్టీ నోటిఫికేషన్ ఊసేలేదని అన్నారు. అక్రమ స్పౌజ్ పోస్టులు రద్దు చేసి ఆ ఖాళీలను టీఆర్టీ నోటిఫికేషన్లో కలపాలని కోరారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ ఆయన హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీను నాయక్, నాయకులు భాను, ఇర్ఫాన్, హరీష్, నరేష్, కోటేష్, చంద్రశేఖర్ రెడ్డి, సునిత, స్వప్న, నవ్య తదితరులు పాల్గొన్నారు.