Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- వివిధ రంగాల్లో నిష్ణాతులైన 27 మంది మహిళలకు రాష్ట్రస్థాయి అవార్డులు
నవతెలంగాణ -హనుమకొండ
రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధమ లక్ష్యమని గిరిజన, స్త్రీ శిశుశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆడిటోరియంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను అట్టహాసంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో 5 ఆరోగ్య మహిళా క్లినిక్‌లతో పాటు కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా క్లినిక్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హౌళీ, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరీక్షల కోసం వచ్చిన మహిళలతో వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన రుద్రమదేవి ఏలిన ఓరుగల్లు గడ్డపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అదృష్టమన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారని, దృఢ సంకల్పంతో రాజకీయాల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుకు వస్తున్నారన్నారు. అంతేస్థాయిలో సమాజంలో అనేక ఆటుపోట్లనూ ఎదుర్కొంటున్నారని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్రంలోని 1200 సెంటర్లలో నిర్వహిస్తున్నామని, రూ.250 కోట్లతో న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నామని చెప్పారు. మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని గతంలో 60 శాతం ఉంటే ప్రస్తుతం 27 శాతానికి తగ్గిపోయిందని అన్నారు. బీపీ, షుగర్, రక్తహీనత పరీక్షలతోపాటు ప్రతి మహిళ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఐదు పీహెచ్‌సీల్లోని ఈ క్లినిక్‌లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో రూ.20కోట్లతో వచ్చే సంవత్సరం నాటికి రెండు పెద్ద భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రీతి ఆత్మహత్య దురదృష్టకరమైన సంఘటనని, విద్యార్థులు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలని, అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో విశేష కృషి చేసిన నిష్టాతులైన 27మంది మహిళలను మంత్రి సత్కరించి రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.
కార్యక్రమాల్లో మంత్రి వెంట ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్, శాసనమండలి ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మెన్ డాక్టర్ సుధీర్, మహబూబాడాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బిందు, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మెన్ దీప్తి రెడ్డి, కమిషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ బి సాంబశివరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమా శ్రీ, రాష్ట్ర పరిశీలకులు, తదితరులు పాల్గొన్నారు.