Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 రోజులపాటు సాగర్ నీరు విడుదలకు హామీ : దీక్షకు మద్దతు తెలిపిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ - బోనకల్
సాగర్ నీటి కోసం రైతులు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షకు నీటిపారుదల శాఖ జిల్లా ఉన్నతాధికారులు దిగివచ్చారు. నీటిపారుదల శాఖ సీఈ శంకర్ నాయక్ హామీతో నిరాహార దీక్షను విరమించారు. నీటిపారుదుల శాఖ ఈఈ చింతల రామకృష్ణ, బోనకల్ సబ్ డివిజన్ డీఈ వల్లపు నాగ బ్రహ్మయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని చివరి ఆయకట్టుగా ఉన్న ఆళ్లపాడు మైనర్ కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆళ్లపాడు, గోవిందాపురం(ఏ) గ్రామాల సర్పంచులు మర్రి తిరుపతిరావు, భాగం శ్రీనివాసరావు ఆయా గ్రామాల రైతులు మంగళవారం 24 గంటలు నిరాహారదీక్షకు దిగారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో సాగర్ నీటి విషయంపై ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సాగర్ నీటి కోసం రైతుల చేపట్టిన నిరాహార దీక్ష విషయం చర్చకు వచ్చింది. రైతు బంధు బోనకల్ మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్‌రావు నిరాహార దీక్ష విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. నిరాహారదీక్ష శిబిరానికి ఈఈ చింతల రామకృష్ణ, వేమూరి ప్రసాదరావును జిల్లా ఉన్నతాధికారులు పంపించారు. మూడు రోజులపాటు ఏకధాటిగా సాగర్ నీటిని విడుదల చేస్తామని సీఈ శంకర్ నాయక్ హామీ ఇచ్చారని, ఈ విషయాన్ని నిరాహార దీక్షలో ఉన్న దీక్షాపరులకు వివరించాలని తమను పంపించినట్టు రామకృష్ణ తెలిపారు. అందుకు రైతులు అంగీకరించలేదు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు సీఈ శంకర్‌నాయక్‌కు ఫోన్ చేసి సమస్య తీవ్రంగా ఉందని, స్పష్టమైన హామీ ఇస్తేనే రైతులు దీక్ష విరమిస్తారని స్పష్టం చేశారు. ఐదు రోజులపాటు ఇస్తేనే ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు జీవం పోసినవారు అవుతారని పోతినేని సుదర్శన్ రావు ఆయనకు స్పష్టం చేశారు. దాంతో శంకరనాయక్ స్పందిస్తూ తప్పనిసరిగా ఐదు రోజులపాటు నీటిని విడుదల చేస్తామని రైతుల సమక్షంలో హామీ ఇవ్వడంతో నిరాహార దీక్షను విరమించారు.