Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ కల్పించుకోవాలని వేడుకోలు
- మంత్రులు సబిత, వేములకు ఉపాధ్యాయ దంపతుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎస్జీటీ, లాంగ్వేజ్ పండితులు, పీఈటీలతోపాటు మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను చేపట్టాలని స్పౌజ్ ఫోరం డిమాండ్ చేసింది. 14 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు నరకం అనుభవిస్తున్నారని తెలిపింది. బాధితుల్లో 80 శాతం వరకు మహిళా ఉపాధ్యాయునిలే ఉన్నారని పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకోవాలని పలువురు బాధితులు వేడుకుంటున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'మహిళల ఆవేదన తీర్చండి, స్పౌజ్ దంపతులను కలపండి'అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. 'నాన్న అటు, అమ్మ ఇటు, పిల్లలు ఎటు'అంటూ చిన్నపిల్లలు ఫ్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డిని స్పౌజ్ బాధితులు కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2,100 స్పౌజ్ అప్పీళ్లలో 615 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టారని వివరించారు. ఇది సంతోషకరమని, సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగిలిపోయిన దంపతులకు న్యాయం చేయాలని కోరారు. అవకాశం ఉన్న క్యాడర్లను పక్కన పెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు. రోజూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఐదేండ్లలోపు పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు ఇలా కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉన్నారని వివరించారు. దీంతో పూర్తిస్థాయిలో బోధనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో మెడికల్ సెలవుల్లో వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం కన్వీనర్ వివేక్, కోకన్వీనర్లు త్రివేణి గౌడ్, రుక్మిణి, విజయలక్ష్మి, నరేష్, ఖాదర్, విజేందర్ గుప్తా, నాయకులు మమత, రాజేశ్వరి, రమాదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు.