Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిక్కర్ స్కామ్‌లో ఈడీ సమన్లు
- 11 వ తేదీన తమ ఎదుట హాజరుకావాలంటు ఆదేశాలు
- కలకలం రేపిన ఈడీ నోటీసులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తమ ఎదుట హాజరుకావా లంటూ బుధవారం నోటీసులు జారీ చేశారు. పీఎంఎల్ఏ చట్టం కింద ఈనెల 11వ తేదీన రావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. అంతకు ముందు ఉదయం జారీ చేసిన నోటీసులో గురువారం 9వ తేదీన ఢిల్లీలో జరిగే విచారణకు రావాలంటూ ఈడీ తన నోటీసులో పేర్కొంది. అయతే తాను ముందుగా నిర్ణయించుకున్న ఆయా కార్యక్రమాల వలన ఆ రోజు తాను రావడం కుదరదనీ, 15వ తేదీన హాజరవుతానని చెబుతూ కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ 10వ తేదీన జాగృతి ఆధ్వర్యాన ఒక రోజు ధర్నా కార్యక్రమాన్ని గతంలోనే నిర్ణయించడం జరిగిందనీ, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన ఉన్న కారణంగా తాను 9వ తేదీన విచారణకు హాజరుకాలేనని ఆమె తన లేఖలో తెలిపినట్టు సమాచారం. అయితే కవిత రాసిన లేఖపై వెంటనే ఈడీ నుంచి సమాచారం అందకపోవడంతో బీఆర్ఎస్ వర్గాలలో కొంత ఉత్కంఠ, సందిగ్ధత ఏర్పడింది. కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈడీ నుంచి కవిత లేఖపై ఎలాంటి స్పందన లేక పోవడంతో కవిత తన ఢిల్లీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మొదట ప్రగతిభవన్‌కు వెళ్లి తండ్రి కేసీఆర్‌ను కలిసి సంప్రదిస్తారని అందరు భావించారు. కాని ఆమె ఫోన్లోనే సీఎంతో మాట్లాడి నేరుగా శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు. అయితే ఢిల్లీకి వెళ్లి తాను నిర్ణయించుకున్న జాగృతి ధర్నాలో పాల్గొనాలనీ, ఈడీ నోటీసుకు సంబంధించి న్యాయపోరాటం చేద్దామని కూతురు కవితకు సీఎం కేసీఆర్ అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏయిర్‌పోర్టుకు చేరుకున్న కవిత సాయంత్రం విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అనంతరం ఏడుగంటల ప్రాంతంలో ఆమె ఢిల్లీకి చేరుకోగా అక్కడి జాగృతి కార్యకర్తలు కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ఇదిలావుండగా రాత్రి ఏడున్నర గంటల సమయంలో కవిత రాసిన లేఖకు ఈడీ స్పందించినట్టు సమాచారం. ఆమె చేసుకున్న విజ్ఞప్తిని మన్నించి 11వ తేదీన ఉదయం పది గంటలకు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ తాజాగా నోటీసులో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈడీ తమ రిమాండ్ రిపోర్టులో పిళ్లైను ఈ స్కామ్‌లో కవితకు బినామీగా పేర్కొన్నది. ముఖ్యంగా లిక్కర్ పాలసీ నిర్ణయంతో పాటు ఇతర వ్యవహారాలలో కవిత చెప్పినట్టుగానే తాను నడుచుకున్నట్టు రామచంద్ర పిళ్లై ఈడీ అధికారుల విచారణలో వెల్లడించినట్టు రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఇది వరకు అరెస్టయిన అభిషేక్ బోయిన్పల్లి , సమీర్ మహేంద్రులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లలో సైతం కవిత పేరును ప్రస్తావించినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా తాజాగా రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే తాజాగా కవితను విచారణకు పిలిచారని తెలుస్తోంది. కాగా గతంలో పిళ్ల్లైను ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి 29 సార్లు విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈనెల 13వ తేదీ వరకు పిళ్లైను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఈడీ అధికారులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిల్లైను , కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించడానికే ఈడీ అధికారులు నోటీసులను ఆమెకు జారీ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ స్కామ్‌లో ఇప్పటి వరకు ఈడీ అధికారులు కవితకు సంబంధించి సేకరించిన ఆధారాలను బట్టి కూడా కవితను విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న కవిత 11వ తేదీ వరకు అక్కడే ఉండి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
ఢిల్లీకి చేరిన కవిత
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి వెళ్లారు. కవితతో మాట్లాడేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు బయట మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా, ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఈ నెల 13 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనాభాలో సగం ఉన్న మహిళలకు రిజర్వేషన్‌ను కచ్చితంగా వర్తింపజేయాలని కవిత కోరుతున్నారు. పార్లమెంటులో మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించిన బీజేపీ సర్కారు, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నిస్తున్న విషయమూ విదితమే. తెలంగాణ సహా 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయనీ, బీజేపీ పాలిత యూపీలో మాత్రం 33 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని కవిత విమర్శించారు.