Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌లకు నిరసన సెగ
నవతెలంగాణ- హన్మకొండ
డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటనకు కారకులైన కేఎంసీ హెచ్ఓడీ నాగార్జున రెడ్డి, కేయూసీ ప్రిన్సిపాల్, ఎంజీఎం సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని డాక్టర్ ప్రీతి న్యాయ పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలని హనుమకొండ హౌటల్ హరితలో బస చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్లను డాక్టర్ ప్రీతి న్యాయపోరాట కమిటీ అడ్డుకుంది. గంటసేపు ఇద్దరు మంత్రులను హౌటల్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. డాక్టర్ ప్రీతి కుటుంబం పట్ల ఎందుకు వివక్షత పాటిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా మంత్రులుగా ఉండి ముఖ్యంగా గిరిజన మంత్రిగా, మహిళగా మహిళలకు న్యాయం చేయనప్పుడు పదవుల్లో ఉండే అర్హత లేదని, వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రీతి మృతి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపడుతుందని, ఇప్పటికే సైఫ్‌ను అరెస్టు చేసామని తెలిపారు. హెచ్ఓడీని కూడా వేరే జిల్లాకు బదిలీ చేసామన్నారు. విచారణ పూర్తయిన వెంటనే రిపోర్టును బట్టి ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎర్రబెల్లి నిరసనకారులను ఉద్దేశించి మీరు రాజకీయం చేస్తున్నారని అనడంతో తాము రాజకీయ నాయకులం కాదని ప్రీతి కోసం న్యాయం కోసం పోరాడే ప్రజా సంఘాల నాయకులమని, వెంటనే మంత్రులు కూడా రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని మంత్రులను సముదాయించి పంపించారు.