Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంటీ బయాటిక్స్ వాడొద్దు
- ప్రభుత్వాస్పత్రుల్లో చూపించుకోవాలి: ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రులకు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో వచ్చే చిన్నారుల సంఖ్య పెరిగిందని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దేశంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరు కుమార్, గాంధీ, ఫీవర్, నిలోఫర్, ఎంజీఎం ఆస్పత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ రాజారావు, డాక్టర్ శంకర్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ చంద్రశేఖర్లతో పాటు అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తిపై ప్రపంచం, దేశం, రాష్ట్రంలో పరిస్థితిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో స్వల్పంగా కేసులు పెరిగాయనీ, ఎక్కువగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇన్‌ఫ్లూయెంజా కేసుల గురించి ఎక్కువగా భయపడి అనవసరంగా యాంటీ బయాటిక్స్ వాడొద్దనీ, వైద్యులు సిఫారసు చేసిన చికిత్సనే తీసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలుంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తున్నందున జ్వరం, జలుబు వంటి లక్షణాలున్న వారు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.