Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓవైపు సన్మానాలు, మరోవైపు ఉరితాళ్లు
- సమన్యాయం లేదంటూ గౌరవెల్లి నిర్వాసితుల ఆవేదన
నవతెలంగాణ-అక్కన్నపేట
సొంత రాష్ట్రంలో మహిళలకు సమన్యాయం జరుగుతుందని భావించామని, కానీ అన్యాయమే జరుగుతోందని, ఆడపిల్లలుగా పుట్టడమే వారు చేసిన శాపం అన్నట్టు భూ నిర్వాసిత మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని గౌరవెల్లి నిర్వాసిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులైన మహిళలు ఉరికొయ్యలు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు మొదలై ఇప్పటికే దాదాపు 14 సంవత్సరాలు పూర్తయిందని, పనులు మాత్రం ఇప్పటికీ నత్తనడకన సాగుతూ భూనిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. భూ నిర్వాసితుల్లో 18 ఏండ్లు నిండి పెండ్లయిన మహిళలకు ఆర్ అండ్ అర్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా మహిళలను సన్మానిస్తుంటే.. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాత్రం మమ్మల్ని పట్టించుకోకుండా దాదాపు 120 మంది మహిళలకు పరిహారం ఇచ్చేది లేదని ముక్కుసూటిగా చెప్పడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు అన్నింట్లో సమాన హక్కులు ఉంటాయని చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విషయంలో ఇలా మొండి చేయి చూపడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ప్యాకేజీ అమలుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు.