Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఆర్భవన్లో ఘనంగా 'ఉమెన్స్‌డే'
నవతెలంగాణ-హైదరాబాద్
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని మొదటగా తీర్మానం చేసింది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ఇష్టపడటం లేదన్నారు. బుధవారం ఎన్టీఆర్భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్భవన్లో జరిగాయి. కేక్ కట్ చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆకాశంలో సగం, జనాభాలో సగం ఉన్నా అనుకున్నంత స్థాయిలో మహిళలకు అవకాశాలు రాలేదని చరిత్ర చెబుతున్నదన్నారు. మహిళా రిజర్వేషన్ల తీర్మానాలు రాజ్యసభలోనే ఆగిపోయాయనీ, మహిళలు ఏకమై పోరాడితే ఎవరైనా దిగిరావాల్సిందే అని అన్నారు. మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్ వచ్చి తీరాలన్నదే తెలుగుదేశం పార్టీ విధానమన్నారు. మహిళలలో పోరాట పటిమ, ప్రతిభ ఉందని ఐరన్ లేడి ఇందిరాగాంధీ, శ్రీలంకలో సిరిమావో బండారు నాయకే, బ్రిటన్‌లో మార్గరేట్ థాచర్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ వంటి నిరూపించారని చెప్పారు. దేశానికి రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కును కల్పించి దేశంలోని మొట్టమొదటి పార్టీ టీడీపీ అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తరపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలను రావుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయనేత చిలువేరు గణేష్, రాష్ట్ర నాయకురాలు షకీలారెడ్డి, గడ్డి పద్మావతి, సూర్యదేవర లత, జాటోతు ఇందిరా, సాయి తులసీ అట్లూరి సుబ్బారావు, టీటీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు ఆజ్మీర రాజునాయక్, షేక్ ఆరీఫ్, అశోక్ గౌడ్, పద్మాచౌదరి, అంజలీ గౌడ్, ధనలక్ష్మీ, ఆశాబిందు, స్వప్న, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.