Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్
- రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్టు తెలిపారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణాల పంపిణీని మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరులో ప్రారంభించారు. అలాగే, తొర్రూరులో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తరపున రూ.1550 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ.270.70 కోట్ల పంపిణీ జరగగా, రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాల్సిన రూ.1550.62 కోట్ల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
దేశంలో 20 గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే 19 తెలంగాణ పల్లెలేనని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, మంత్రి ఎర్రబెల్లి, ఆయన టీం చేస్తున్న కృషి వల్లనే దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని కొనియాడారు. గ్రామ గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, మొక్కలు పెంపకం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, శ్మశానవాటికలు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పనులు గ్రామాల్లో జరుగుతున్నాయన్నారు. ఎర్రటి ఎండల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చల్లని నీటిని పంటలకు వస్తున్నాయని, దాంతో రైతులు పంటకు పెడుతున్న పెట్టుబడి తిరిగి సంపాదించుకుంటున్నారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ నేతన్నలు పొట్ట చేత పట్టుకుని భీవండి, సూరత్, బొంబాయిలకు పోతున్నారని, వారిని ఆదుకునేందుకు కొడకండ్లలో మినీ టెక్ట్స్‌టైల్ పార్క్‌కు 20 ఎకరాల స్థలం కేటాయిస్తూ ఇక్కడి నుంచే జీవో ఇస్తున్నట్టు తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎన్నో పనులు చేస్తోందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం అమలుచేయడం లేదని ఆరోపించారు. జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పి చెప్పి ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వాపోయారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు, విషాలుచిమ్మి ప్రజలను విడగొట్టి, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి, కుట్ర పూరితంగా పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పలు అభివృద్ధి పనులను ప్రారంభిం చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో సీఎం కేసీఆర్ కృషితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప కానుక ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3,85,082 సంఘాలకు రూ.2,561.77 కోట్లు విడుదల చేసిందని వివరించారు. ఇంత పెద్ద ఎత్తున నిధులను డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రాష్ట్రం దేశంలో లేదన్నారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్ళపల్లి రవిందర్‌రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకన్న, సతీశ్ రెడ్డి, జెడ్పీచైర్మెన్లు పాగాల సంపత్ రెడ్డి, సుధీర్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, కలెక్టర్ శశాంక, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.