Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడ చూసినా జ్వరపీడితులే..
- కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ొ పిల్లలు,వృద్ధులపైనే అధిక ప్రభావం
- భయపడాల్సిన అవసరం లేదు: నిపుణులు ొ సొంతవైద్యం వద్దు: డాక్టర్లు
నవతెలంగాణ - మొఫిసిల్ యంత్రాగం
వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని దగ్గు, జలుబు సహా వారం పాటు వీడకుండా ఉంటున్న జ్వర లక్షణాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడ చూసినా.. ఎవరిని కదిలించినా ఇదే పరిస్థితి. కరోనా లక్షణాలుగా కనిపిస్తున్నా.. భయపడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధుల్లోనే బాధితులు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతు న్నాయి. దగ్గు ఎక్కువ రోజులు తగ్గడం లేదు. హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో గత వారం ప్రతిరోజూ 600 నుంచి 800 కేసులు ఇలాంటివి నమోదయ్యాయని ఆస్పత్రి అధికారి శంకర్ చెబుతున్నారు. ఇది వైరల్ ప్లూ మాత్రమేనని అన్నారు. స్వైన్ ప్లూ కేసులుగా కూడా పరిగణించడానికి వీల్లేదన్నారు. అధికారుల సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 400 పైగా కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఐసీఎంఆర్ సూచించినట్టు.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవడం, మంచి ఆహారం, శుభ్రమైన మంచినీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి పది మందిలో సగం జ్వరపీడితులే ఉన్నారు. సాధారణంగా ఈ సీజన్లో ఒక్కో ఆస్పత్రికి రోజులో పది మంది వచ్చే ఔట్పేషెంట్లు ఇప్పుడు వంద మందికిపైగా వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రులను 'నవతెలంగాణ' సందర్శించగా.. ఎక్కువగా పిల్లల ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆస్పత్రుల్లో చేరే పిల్లలు, ఆపై వయసు వారిలో ఎక్కువమంది జ్వరం, దగ్గు, నిమోనియావంటి లక్షణాలతో వస్తున్నట్టు చెప్పారు. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి భయపడొద్దని ధైర్యం చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జ్వరం, పసరికలు, డెంగ్యూ వంటి వాధ్యులొస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజూ 150 మంది ఔట్ పేషెంట్లు వచ్చేవారు. వారం రోజులుగా ఆ సంఖ్య 250కి చేరింది. ఆస్పత్రికి వస్తున్న వారిలో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్, డెంగ్యూ, చలిజ్వరం, పసరికలతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్ధితి ఉన్నా. వైద్యానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.
సొంతవైద్యం ప్రమాదకరం : డాక్టర్ కె.శివకుమార్, వైద్యనిపుణులు, కరీంనగర్పిల్లల విషయంలో తల్లిదండ్రులు సొంత వైద్యం చేయకూడదు. మెడికల్ దుకాణాల్లో ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడొద్దు. వైద్యులను సంప్రదించి.. జ్వరం, దగ్గు లక్షణాలను బట్టి వైరస్ ప్రభావం ఏ మేరకు ఉందో నిశితంగా పరిశీలించి వారి సూచన మేరకే మందులు వాడాలి. వాతావరణంలో వచ్చిన మార్పులు, వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో పిల్లల్లో జ్వరం, దగ్గు వారంపాటు ఉంటోంది.