Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీరామనవమి నుంచి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్
- మహిళా దినోత్సవం వేళ మూడు అద్భుతమైన పథకాలు : మంత్రి హరీశ్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
''మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ మహిళలకు అందిస్తున్న మరో గొప్ప కానుక ఆరోగ్య మహిళ పథకం.. దీనితోపాటు మహిళలకు వడ్డీలేని రుణాలు సహా ఈ శ్రీరామనవమి నుంచే గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నాం'' అని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. మహిళల్లో చైతన్యం రావాలని, సీ సెక్షన్ డెలివరీలు తగ్గాలని అన్నారు. ప్రభుత్వం న్యూట్రిషన్ పాలసీ పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే.. మరోవైపు బీజేపీ ప్రభుత్వం పార్టీషన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. బుధవారం కరీంనగర్ నగరంలోని బుట్టి రాజారాం కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మార్క్‌ఫెడ్‌లో నిర్వహించిన మహిళాదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ రెండు కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వడ్డీ లేని రుణాలను సీఎం కేసీఆర్ ఈరోజే విడుదల చేశారన్నారు. మొదటి దశలో రూ.750 కోట్లు వడ్డీ లేని రుణాలను మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రెండో దశ రుణాలను 3, 4 నెలల తర్వాత అందజేస్తామన్నారు. మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని, మిషన్ భగీరథ, ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని తెలిపారు. గర్భిణుల కోసం ఆరోగ్య లక్ష్మి, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఆరోగ్య మహిళ స్కీంలో భాగంగా ప్రత్యేక ఆస్పత్రుల సంఖ్యను దశలవారీగా పెంచుతామని తెలిపారు. ఈ పథకంలో మహిళలకు షుగర్, బీపీ వంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ కేన్సర్లు, స్క్రీనింగ్ చేయనున్నారు. థైరాయిడ్, అయోడిన్ సమస్య, రక్తహీనత తదితర సమస్యలకు సంబంధించి రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు వైద్యమూ అందించనున్నారు. హార్మోన్ రీప్లేస్మెంట్, థెరపీ మెడికేషన్స్ సహా వైద్య సలహాలు, సూచనల కోసం కౌన్సిలింగ్ కూడా ఇస్తారని చెప్పారు. డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ సహా వెయిట్మేనేజ్మెంట్, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్ మేనేజ్మెంట్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, ఐవీ, యూటీఐ అండ్ పెల్విక్ ఇన్ప్లమేటరీ సహా అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ టెస్టుకు రెఫర్ చేయనున్నారు.
సర్జరీలు, ఇతర అడ్వాన్స్డ్ వైద్య పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక సెంటర్ పెడుతున్నామని చెప్పారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో రూ.3.14 కోట్లతో నిర్మించిన 'ఆరోగ్య మహిళ' ప్రాంగణం, పీసీఓడీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ ఫెర్టిలిటీ వార్డు, రూ.80 లక్షలతో డయాగస్టిక్ రేడియాలజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం మూడో అంతస్తులో రూ.6.25కోట్లతో ఏర్పాటుచేసిన అదరపు పడకలు, రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆస్పత్రి భవనాలను ప్రారంభించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మహంతి సహా పలువురు జిల్లా మహిళా అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ సునీల్ రావు, శాసనసభ్యులు రసమయి, రవిశంకర్ సహా ఆయా కార్పొరేషన్ల చైర్మెన్లు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అధికారులు పాల్గొన్నారు.