Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత జాగాలు, పోడు భూములు,
- గొర్రెల పంపిణీ, దళిత బంధుపైనా చర్చ
- కవిత అంశం,
- గవర్నర్, సీఎస్ వివాదంపైకూడా?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ భేటి కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుందని ఇప్పటికే సీఎంవో ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునేవారికి ఆర్థిక సాయం చేసే విషయం, పోడు భూముల విషయంలో గిరిజనులకు పట్టాలు ఇచ్చే విషయం, గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు తదితర అంశాలూ చర్చకు రానున్నట్టు తెలిసింది. క్యాబినెట్ భేటి అనంతరం రాజకీయపరమైన విషయాలను మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితికి సంబంధించి సీఎం కేసీఆర్ చేయించిన ప్రత్యేక సర్వేపై కూడా మాట్లాడనున్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ను ముందుకు తీసుకుపోవడంతోపాటు నియోజకవర్గాల్లో వ్యక్తులవారీగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్లస్‌లు, మైనస్‌లు కూడా చర్చించే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
గవర్నర్, సీఎస్ వివాదం
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిపై విమర్శలు చేసిన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులతో సీఎం చర్చించే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందంటూ, సీఎస్ అయిన తర్వాత కనీసం ప్రోటోకాల్ కూడా పాటించరా ? అని గవర్నర్ ట్వీట్ చేసిన విషయం విదితమే. దీనిపై ప్రభుత్వంతోపాటు ఐఏఎస్‌ల్లోనూ చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన దాదాపు 10 బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి రాజ్‌భవన్ పెండింగ్ పెట్టిన నేపథ్యంలో సీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమే ఈ వివాదానికి మూల కారణం కావడం గమనార్హం.
కవిత అంశంపైనా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులపైనా మంత్రులు, న్యాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందని ప్రగతిభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కవిత బుధవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గురువారం విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే సంగతి ఉత్కంఠగా మారింది. ఇదిలావుండగా శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర మహిళా బిల్లు ఆమోదం కోసం కవిత దీక్ష చేయనున్న విషయం విదితమే. భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆయా పార్టీల నేతలు, మహిళా సంఘాలను ఇప్పటికే ఆహ్వానించి ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం గురు, శక్రవారాల్లో ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని కవిత బుధవారమే ట్విట్ చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఈడీని గడువు కోరినట్టు సమాచారం. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయనీ, దీనిపై ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలతోపాటు న్యాయనిపుణులతోనూ కవిత ఇప్పటికే చర్చించిన అనంతరమే ఢిల్లీ వెళ్లిపోయారు. కాగా ఈడీ విచారణకు కవిత హాజరయ్యే అవకాశం లేదని తెలిసింది. శుక్రవారం మాత్రం కచ్చితంగా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. కవితకు ఈడీ నోటీసులపై క్యాబినెట్ సమావేశం తర్వాత సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయకోవిదులతో సీఎం చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారనీ, ఆ నేపథ్యంలో కవితకు 'నువ్వు ఢిల్లీ వెళ్లు..శుక్రవారం జరిగే ధర్నాపైనే దృష్టిపెట్టు..మిగతా విషయాలు వదిలేసేరు' అని కేసీఆర్ స్పష్టత ఇచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఆ మేరకే కవిత ఆమె ఢిల్లీ పయనమైనట్టు తెలిసింది.
10న బీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం, పార్టీకార్యవర్గం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరుగనున్నది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మెన్లు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మెన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మెన్లు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్సరం నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆహ్వానితులు ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.