Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీలను తొక్కిపెట్టిన కేంద్రం
- ఊసేలేని గిరిజన యూనివర్సిటీ
- కలగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. అటకెక్కిన ఐటీఐఆర్
- వెనుబడిన జిల్లాలకు మూడేండ్లుగా నిధులు బంద్
అచ్చిన ప్రశాంత్
అదానీ కోసం మోడీ సర్కారు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని బలిచ్చింది. తమ చెంతకు ఉన్నత చదువుల కోసం కేంద్ర గిరిజన యూనివర్సిటీ రాబోతున్నదని సంబురపడ్డ ఆదివాసీ, గిరిజన బిడ్డల ఆశలపై నీళ్లు చల్లింది. దశాబ్దాల డిమాండ్‌గా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కలగానే మిగిల్చింది. ఐటీఐఆర్‌ను రద్దుచేసింది. వెనుబడిన జిల్లాలకు నిధులను మూడేండ్లుగా బంద్ చేసింది. నియోజకవర్గాల పునర్విభజనను అటకెక్కించింది. కాళేశ్వరానికి జాతీయహోదా ఊసేలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రంలోని మోడీ సర్కారు బుట్టదాఖలు చేసింది. ఒకవేళ వాటిని అమలు చేసి ఉంటే రాష్ట్రంలో కొత్తగా లక్షలాది మందికి ఉపాధి లభించేది. రాష్ట్రం అభివృద్ధి చెందేది.
ఉక్కు కర్మాగారం ఇకలేనట్టేనా?
బయ్యారంలో ఉక్కుకర్మాగారం ఏర్పాటు లేదంటూ కేంద్రం తేల్చిచెప్పింది. నాణ్యమైన ఇనుప ఖనిజం లేదని మెలికపెట్టి రద్దుచేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఉపాధికి గండికొట్టింది. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందబోతున్నదని సంతోషపడ్డ అడవిబిడ్డల ఆశలపై నీళ్లు చల్లింది. 180 కిలోమీటర్ల దూరంలోని ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బైలడిల్లా గనుల నుంచి దిగుమతి చేసుకోవాలనీ, దానికయ్యే ఖర్చును భరిస్తామని రాష్ట్ర సర్కారు ప్రత్యామ్నాయం చూపినా ససేమిరా అన్నది. సింగరేణి నుంచి బొగ్గు, కేటీపీఎస్ నుంచి విద్యుత్, మాదారం నుంచి డోలమైట్ ఖనిజంఇస్తామనీ, నీటివనరులను సమకూరుస్తామని భరోసానిచ్చినా కాదుపొమ్మన్నది. తీరా చూస్తే కార్పొరేట్ ఘనుడు అదానీకి చెందిన పోస్కో స్టీల్ ప్లాంట్‌కు బైలడిల్లా గనులను కేటాయించింది. అదానీ కంపెనీ 1800 కిలోమీటర్లు తరలిస్తే రాని నష్టాలు..బయ్యారం ఉక్కు కర్మాగారానికి కేవలం 180 కిలోమీటర్ల నుంచి తరలిస్తే ఎలా వస్తాయో మోడీ సర్కారుకే తెలియాలి.
వెనుకబడిన జిల్లాల నిధుల నిలిపివేత
రాష్ట్ర విభజన చట్టం 94(2) సెక్షన్ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి. ఆ జాబితాలో రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగతా 9 ఉమ్మడి జిల్లాలను చేర్చారు. ఆ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.450 కోట్ల రూపాయలు కేటాయించాలి. మూడేండ్లకు సంబంధించి రాష్ట్రానికి రూ.1,350 కోట్లు రావాలి. కేంద్రం వాటిని తొక్కిపెట్టింది. ఆ నిధులే అంది ఉంటే ఆయా జిల్లాల్లోనూ ప్రగతి కనిపించేది.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎన్నడో?
ఏపీలోని విజయనగరంలో, మధ్యప్రదేశ్‌లో గిరిజన యూనివర్సీటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ములుగులోనూ వర్సిటీ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని వేలాది మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులకు మరిన్ని అవకాశాలు దక్కేవి. జాకారంలో వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 337 ఎకరాల భూమిని కేటాయించింది. రూ.19 కోట్లను ఖర్చుచేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ములుగు గిరిజన యూనివర్సిటీ ప్రస్తావననే లేవనెత్తట్లేదు.
కాజీ పేటకు కాదన్నారు..
లాతూరుకు ఇచ్చారు..
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం నో అని చెప్పేసింది. రైల్వే అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతమున్న ఫ్యాక్టరీలు సరిపోతాయి కాబట్టి కాజీపేటలో అవసరం లేదని తేల్చింది. దానికి విరుద్ధంగా మహారాష్ట్రలోని లాతూర్‌లో మాత్రం కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. గుజరాత్లో దాహౌద్ రైల్వే వర్క్‌షాపును లోకోమోటివ్ ఉత్పత్తి కర్మాగారంగా అప్‌గ్రేడ్ చేసింది. దీనిని బట్టే తెలంగాణ మీద కేంద్రానికి ఎంత వివక్ష ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఐటీఐఆర్ రద్దు..
ఐటీ అభివృద్ధిపై ఎఫెక్ట్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టును రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా కొనసాగించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు వచ్చి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనంగా ఐదులక్షల మందికి ఉపాధి లభించేది. మరోవైపు కేంద్రం 22 సాఫ్ట్వేర్ పార్కులను ఆయా రాష్ట్రాలకు కేటాయించింది. అందులో తెలంగాణ ప్రస్తావనే లేదు.