Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్ని లూటీ చేసే విద్యుత్ సవరణ బిల్లు
- సెలెక్ట్ కమిటీలో ఉన్నా...మెడపై వేలాడే కత్తే
- సామాన్యుల పోరాటాలే పరిష్కారాలు
ఢిల్లీ రైతాంగ ఉద్యమం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రావల్సింది విద్యుత్ ఉద్యమమే. మోడీ సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాల మోసం రైతాంగానికి అర్ధమై, రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు సామాన్యుడికి సైతం అర్థం కావల్సింది విద్యుత్ చట్టమే. మనిషి బతకాలంటే శ్వాస తర్వాత మళ్లీ అవసరమైంది కరెంటే. కొన్ని చోట్ల ఆ శ్వాస పీల్చడానికీ కరెంటే అవసరం. ఇప్పుడు మోడీ సర్కార్ ఆ కరెంటునే కార్పొరేట్లకు కట్టబెట్టి, ప్రయివేటు 'దందా'కు కుట్రలు చేస్తున్నది. కేవలం విద్యుత్ ఉద్యోగులు మాత్రమే ఈ కుట్రల్ని ఛేదించ లేరు. సామాన్యుడు చేయి కలపాలి. అలా జరగా లంటే ముందు 'తనకు' ఏం నష్టం జరుగుతుందో తెలియాల్సిందే.
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
కార్పొరేట్లకు ఇలా...: 2003 విద్యుత్ చట్టమే ప్రయివేటుకు పెద్దపీట వేసేందుకు చేయబడింది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు కరెంటును పూర్తిగా కార్పొ రేట్లకు కట్టబెట్టేందుకు విద్యుత్ సవరణ చట్టం-2022 తెచ్చింది. ప్రభుత్వరంగంలో ఉన్న విద్యుత్ సంస్థలన్నీ, తమ ఆస్తులకు అద్దెలు వసూలు చేసుకోవడానికే పరిమితం అవుతాయి. ఆ ఆస్తుల్ని కార్పొరేట్లు స్వాధీనం చేసుకొని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సహా అన్ని బాధ్యతల్ని పూర్తిగా వారే నిర్వహిస్తారు. కరెంటు బిల్లులు, యూనిట్ రేట్ల నిర్ణయం కూడా వారిదే. భారం భరించాల్సింది మాత్రం సామాన్యులే.
రాష్ట్రాల అధికారాలు గుంజుకొనుడే..: 2003 విద్యుత్ చట్టం ప్రకారం కరెంటు అంశం కేంద్రం అజమాయిషీలో రాష్ట్రాల పరిధిలోనిది. కరెంటు చార్జీల నిర్ణయం కోసం నియంత్రణ మండళ్ల (ఈఆర్సీ) ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. మోడీ సర్కారు ప్రతిపాదించిన 2022 సవరణ బిల్లులో ఆ అధికారాన్ని రాష్ట్రాల నుంచి లాగేసుకొని, ఈఆర్సీ చైర్మెన్లను తామే నియమిస్తామని సవరణ చేసుకుంది. ఈ ప్రభావం రాష్ట్రంలో రైతులు, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, రజకులు, క్షౌరవృత్తిదారులు వంటి కుల వృత్తులవారికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు, పేద, మధ్యతరగతి ప్రజలకు టెలిస్కోపిక్ విధానంలో టారిఫ్ ద్వారా ఇస్తున్న రాయితీలు సహా అన్నింటిపై కోత పడుతుంది. కరెంటు చార్జీలు పెరుగుతాయి.
మోటార్లకు మీటర్లు : రైతులు పంటల కోసం వాడుకుంటున్న కరెంటుకు లెక్కలు చెప్పాలి. దానికోసం మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని మోడీ సర్కారు 2022 సవరణ ప్రతిపాదనల్లో పేర్కొంది. మొదట మీటర్లు పెట్టించడం, ఆ తర్వాత చార్జీలు వడ్డించడం ఈ సవరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. దీనితో నేరుగా పొలాల్లో కాకుండా ప్రస్తుతానికి వ్యవసాయానికి కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. ఊరి దాకా వచ్చిన ప్రమాదం...ఊర్లోకి రాకుండా పోదుకదా!
ప్రీపెయిడ్ మీటర్లు
ఇప్పటి వరకు కరెంటు వాడుకున్నాక వచ్చే బిల్లును చెల్లిస్తున్నాం. అలాకాకుండా ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేసి, రీచార్జి చేసుకుంటేనే కరెంటు సరఫరా చేస్తామని సవరణల్లో ప్రతిపాదించారు. ఈ ప్రీ పెయిడ్ మీటర్ల కంపెనీలను ఇప్పటికే అదానీ గ్రూప్ కొనేసింది. దశలవారీగా ఈ మీటర్లను ఇండ్లకు అమర్చమని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సిఈఆర్సీ) ముసాయిదా ప్రతిపాదనలు రూపొందించి, రాష్ట్రాల ఈఆర్సీలకు పంపింది. మొన్నటి వరకు సెల్ఫోన్ నెలవారీ రీచార్జి కూపన్ రూ.49 ఉంటే, ఇప్పుడు రూ.149కి పెరిగి, 28 రోజులకే కుదింపబడినట్టు... భవిష్యత్లో ప్రీ పెయిడ్ కరెంటు మీటర్ల వ్యవహారం కూడా ఇలాగే మారబోతుంది.
'పునరుత్పాదకం' తప్పనిసరి
బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నందున, ప్రకృతినుంచి సహజసిద్ధంగా వచ్చే పునరుత్పాదక విద్యు త్ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ సవరణ బిల్లులో ప్రతిపాదించారు. అంటే సోలార్, విండ్, బయోగ్యాస్ వంటి వాటి నుంచి వచ్చే కరెంటును డిస్కంలు కొనాలి. ఇవన్నీ పూర్తిగా ప్రయివేటు రంగంలోనే ఉన్నాయి. థర్మల్తో పోలిస్తే ఈ కరెంటు చాలా ఖరీదైంది. ఎక్కువ సొమ్ము పోసి ఈ కరెంటు కొన్నాక, వినియోగదారుడి నుంచి ఎక్కువ చార్జీనే వసూలు చేస్తారు కదా!
ఉద్యోగులే ఆపారు
ఇప్పటి వరకు ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా విద్యుత్ ఉద్యోగులే ఆపగలిగారు. అనేక ఆందోళనల ద్వారా తమ నిరసనలు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఈ బిల్లును మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినప్పుడు దేశంలోని 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సామూహికంగా సమ్మెలోకి వెళ్లి కేంద్రాన్ని హెచ్చరిం చారు. ప్రతిపక్షపార్టీలు పార్లమెంటును స్తంబింప చేశాయి. మరో గత్యంతరం లేక మోడీ ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. అయినా ఈ బిల్లు ప్రజల మెడపై వేలాడుతున్న కత్తే. దాన్ని ఒడిసిపట్టి, యుద్ధానికి సిద్ధం కావల్సిందీ ప్రజలే!
పంపిణీ ప్రయివేటుకు
మోడీ సర్కారు ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఒక ప్రాంతంలో ఒకే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) ఉండరాదు. ఆ పరిధిలో ఎన్నయినా ప్రయివేటు పంపిణీ సంస్థలు ఉండొచ్చు. అవన్నీ ఇప్పటి వరకు ప్రభుత్వరంగంలో నిర్మాణమైన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫారాలు, కరెంటు లైన్లు, స్తంబాలకు నామమాత్రంగా అద్దె చెల్లించి లేదా పూర్తి ఉచితంగా తమ వినియోగదారులకు కరెంటును సరఫరా చేసుకోవచ్చు. ఫలితంగా ఇప్పటి వరకు పెద్ద వినియోగదారుల నుంచి పేద, మధ్య తరగతి ప్రజలకు క్రాస్ సబ్సిడీ పేరుతో బదిలీ అవుతున్న సొమ్ము కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లిపోతుంది. మళ్ళీ అంతిమంగా పేదలపై టారిఫ్ భారం పెరుగుతుంది.