Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి
- ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ...భారీ జనసమీకరణ
- ఉమ్మడి రాష్ట్రంలో ఇండ్లు నిర్మించుకున్న పేదల అప్పు మాఫీ
- రెండో విడత దళిత బంధుకు నిర్ణయం
- ఏఫ్రిల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ
- కాశీ, శబరిమలలో వసతి గృహాల నిర్మాణం
- రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దళితబంధు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో 58,59, అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, కాశీ, శబరిమలలో రాష్ట్ర ప్రభుత్వ వసతి గహాలను నిర్మించాలని నిర్ణయించింది. అనంతరం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మెన్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మీడియాకు వివరించారు.
ఇండ్లు లేని పేదల కోసం కొత్త పథకం
రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 'గృహలక్ష్మి పథకం'లో నాలుగు లక్షల మందికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయమందిస్తుందన్నారు. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఆ ఇంటి ఇల్లాలు పేరుతోనే మంజూరు చేస్తామన్నారు. తొలి విడుతలో 4లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి మూడువేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. లబ్దిదారులకు మూడు లక్షల రూపాయాలను ఒక్కో దఫాలో లక్ష రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. లబ్ధిదారుడు తన ఇంటిని తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలను సులభతరం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయనీ, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినట్టు వివరించారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఇచ్చిన రూ.40వేలు, రూ.60వేలల్లో అప్పులు ఉండేవనీ, గతంలో అప్పులన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దాదాపు రూ.4వేలకోట్లు పేదలపై అప్పులుంటే, ఆ అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు.
పండుగలా అంబేద్కర్ విగ్రహావిష్కరణ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని (ఏప్రిల్ 14న) 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు హరీశ్‌రావు వెల్లడించారు. నక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి.. లక్షలాది మంది మధ్య అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని చెప్పారు.
రెండో విడతలో 1.30 లక్షల మందికి 'దళితబంధు'
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని కొనసాగించనున్నట్టు మంత్రి తెలిపారు. రెండో విడతలో 1.30లక్షల మందికి దళితబంధు ఇస్తామన్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు యూనిట్లు అందజేయగా...త్వరలో రెండో విడత ప్రక్రియను చేపట్టనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. దళితబంధు పథకం ఆగస్టు 16, 2021న ప్రారంభమైందనీ, ప్రతియేటా అదే రోజు వేడుకలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించనున్నట్టు తెలిపారు.
పోడు రైతులకు శుభవార్త
పోడుసాగుదార్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నాలుగులక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,55,393 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారులకు పట్టాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పోడు భూముల పంపిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టు పేర్కొన్నారు.
గొర్రెల పంపిణీకి ఓకే
రెండో విడత పంపిణీ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించి ఆగస్టు నెలఖారుకల్లా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కోసం 7.31లక్షల మంది లబ్ధిదారులను గతంలోనే గుర్తించినట్టు తెలిపారు.
ఇండ్ల క్రమబద్దీకరణ
ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59 కింద సకాలంలో కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని హరీశ్‌రావు తెలి పారు. కటాఫ్ డేట్ రిలాక్సేషన్ ఇవ్వాలంటూ ప్రజా ప్రతిని ధుల నుంచి విజ్ఞప్తులు అందాయని చెప్పారు. వాటిని దృష్టి లో ఉంచుకుని మరోసారి వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణ యించినట్టు తెలిపారు. జీవో 58 కింద ఇప్పటి వరకు 1,45, 668మందికి పట్టాలు పంపిణీ చేశామనీ, 59 జీవో కింద ఇప్పటి వరకు 42 వేల మంది లబ్ధి పొందారని చెప్పారు.
తెలంగాణ భక్తుల కోసం కాశీ, శబరిమలలో వసతి గృహాలు
తెలంగాణ రాష్ట్ర భక్తుల సౌకర్యార్థం కాశీ, శబరిమలో వసతి గహాలను నిర్మించాలని నిర్ణయించినట్టు హరీశ్‌రావు చెప్పారు. కాశీలో నిర్మించే వసతి గహానికి రూ.25కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ స్థలం లభ్యం కాకపోతే ప్రయివేటు స్థలం కొనుగోలు చేసి అన్ని వసతులతో కూడిన సముదాయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శబరిమలలో కూడా రూ.25కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడి నుంచి వెళ్లే భక్తుల కోసం అన్ని వసతులతో కూడిన భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం అంగీకరించినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షకు రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ నాయకలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.