Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే..
- కరీంనగర్ గడ్డపై రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన చరిత్ర కాంగ్రెస్‌ది
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
- యాత్ర ఫర్ ఛేంజ్‌లో భాగంగా కరీంనగర్లో బహిరంగసభ
- కాంగ్రెస్‌ది ఛత్తీస్‌గఢ్ మోడల్ : ఆ రాష్ట్ర సీఎం భూపేష్ భగేల్
- వేలాదిగా తరలొచ్చిన జనం.. కిక్కిరిసిన అంబేద్కర్ స్టేడియం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'కేేసీఆర్పై కోపంతో బీజేపీ వైపు చూస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అవుతుంది. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్‌గఢ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలి. తెలంగాణ మోడల్ కావాలో.. ఛత్తీస్‌గఢ్ మోడల్ కావాలో ఆలోచన చేయాలి. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో నిర్ణయించుకోవాలి' అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కరీంనగర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా గురువారం కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మనగర్ బైపాస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 'కరీంనగర్ కవాతు బహిరంగ సభ'లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఇదే అంబేద్కర్ స్టేడియం వేదికగా 2004లో తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు.మాట తప్పక మడమ తిప్పక.. సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్రం ఎవరిపాలైందో ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని, కనీసం కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. 'తెలంగాణ ఉద్యమకారులను నిరుద్యోగులను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా.. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, ఆయన కుటుంబం కరీంనగర్‌కు ఏం చేశారు? పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగాణ ఏర్పడింది. తల్లిని చంపి పిల్లను బతికించారని మోడీ అవహేళన చేసిన మాట గుర్తుంచుకోవాలి' అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆది శంకరాచార్య తర్వాత దేశమంతా తిరిగిన వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విద్వేషాన్ని వీడి దేశ సమైక్యతను కాపాడాలని రాహుల్ సందేశం ఇచ్చారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు చూసి ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామన్న ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆ హామీని గాలికొదిలేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ ఏర్పడలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 'తెలంగాణ వచ్చింది.. కానీ నిధులు మాయమైపోయాయి. ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. ప్రాణహితకు అంబేద్కర్ పేరును తొలగించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు' అని అన్నారు. బహిరంగసభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, జైరాం రమేష్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహా రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
కాంగ్రెస్ ది ఛత్తీస్‌గఢ్ మోడల్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్
'దేశ సంపద ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది బీజేపీ మోడల్. తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలోకి వెళ్లిపోయింది. ఇది తెలంగాణ మోడల్.. ఛత్తీస్‌గఢ్‌లో రైతాంగానికి మద్దతు ధర, నిరుద్యోగులకు భృతి ఇలా అనేక సంక్షేమాలను అమలు చేస్తున్న ఆ రాష్ట్ర మోడల్ కాంగ్రెస్‌ది' అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. దేశంలోకెల్లా రైతులకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ సర్కారుదని చెప్పారు. నిరంకుశ పాలన నుంచి.. పేదలు, రైతుల సంక్షేమాన్ని కోరే కొత్త తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 'కరీంనగర్.. తెలంగాణ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణను ఎప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు కరీంనగర్ గుర్తొస్తుంది. తెలంగాణ వచ్చినా రైతులు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు' అన్నారు.