Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు వి6 ఛానెల్, వెలుగు దినపత్రికను బ్యాన్ చేస్తామని బెదిరించడం సమంజసం కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ వ్యాఖ్యానిం చడం దారుణమని అభిప్రాయపడింది. వి6, వెలుగులో బీఆర్ఎస్ పార్టీ, లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వార్తలు, చేసిన ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య సూచించారు. కాగా మంత్రి కేటీఆర్, మీడియా ముఖంగా మీడియాకే అల్టీమేటమ్ ఇవ్వడం ప్రజా స్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడటం కేటీఆర్‌కు శోభనివ్వదని పేర్కొన్నారు. మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత ్లో చోటుచేసుకున్న అల్లర్లు, మూక దాడులపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కేటీఆర్ ఖండించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పరిణితి చెందిన ప్రజానాయకుడిగా ఆయన చొరవను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజం కోసమే మీడియా పనిచేస్తుందనీ, అందుకే రాజ్యాంగం మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తించిందని వివరించారు. అలాగే ప్రభుత్వాలు విమర్శను స్వాగతించాలనీ, ఆమేరకు సర్కారులో ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం ఉండాలని కోరారు. రెండు రోజుల క్రితం పత్రికలు, ఛానెళ్లు విమర్శలు చేస్తూనే, మంచిని ప్రోత్సహించాలని మహిళా జర్నలిస్టుల సన్మాన సభలో కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. వి6, వెలుగుపై మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
'టీన్యూస్, నమస్తే తెలంగాణ రిపోర్టర్లను బీజేపీ ఆఫీసులోకి అనుమతించాలి'
బీజేపీ తెలంగాణ కార్యాలయంలోకి టీన్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల రిపోర్టర్లను అనుమతించకపోవడాన్ని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఖండించింది. మీడియా ప్రజలకు జవాబుదారిగా ఉంటుందనీ, ఆమేరకు దాని స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని కోరింది. అలాగే బీజేపీ కార్యాలయంలో కొన్ని పత్రికల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారనీ, ఇది సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.