Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
- మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసిన బీసీ నాయకులు
నవతెలంగాణ-అంబర్‌పేట
బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజీ, పాఠశాల విద్యార్థులకు, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. 2017లో మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సుల కంటే ముఖ్యమంత్రి మెస్ చార్జీలు ఎక్కువ చేసి పెంచారని, ఇప్పుడు కూడా అదే విధంగా పెంచాలని కోరారు. ఆరు సంవత్సరాల కాలంలో మెస్ చార్జీలు పెంపుదల లేదన్నారు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు 100 శాతం పెరిగాయని తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం చేసిన ప్రతిపాదనలు 25 శాతం సరిపోదని, దీనిని కనీసం 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు నెలకు రూ.1500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్, గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలు 8 నుంచి పదవ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.2500కు, మూడో తరగతి నుంచి ఏడో తరగతి వారికి రూ.950 నుంచి రూ. 2000కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీ విద్యార్థులకు జనాభా ప్రకారం 500 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు పాకెట్మని మంజూరు చేయాలని కోరారు. హాస్టళ్లలో వర్కర్లు సరిపోను లేరని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఇంటర్ చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజులు ప్రభుత్వమే భరించాలని, ర్యాంకుల నిబంధన ఎత్తేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం పెండింగ్‌లో ఉన్న ఐదు లక్షల 40 వేల మందికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని తగు విధంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. మెస్ చార్జీలు 50 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. పెంచేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, రాజ్ కుమార్, వేముల రామకృష్ణ, వెంకట్ యాదవ్, నందా గోపాల్, నిఖిల్, నిమ్మల వీరన్న తదితరులు పాల్గొన్నారు.