Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పందించాలి విలేకర్ల సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు డా. చెరుకు సుధాకర్
నవతెలంగాణ - నల్లగొండ
భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్య అహంభావాన్ని ఇక భరించలేమని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పలు కుల సంఘాలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నవ్య ఆస్పత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబం 40 ఏండ్లుగా అనేక కష్టాలను చూసిందన్నారు. తన జీవితంలో ఇలాంటి మాటలు పడాల్సి వస్తదని ఏనాడూ కలలో కూడా ఊహించలేదన్నారు. కోమటిరెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 'నా కుమారున్ని, నన్ను తిట్టిన తీరు చూస్తే కన్న తల్లిని అవమానపర్చినట్టే ఉందని' అన్నారు. మరోవైపు న్యాయస్థానంపై గౌరవం ఉందని మాట్లాడుతుంటే సమాజం సిగ్గు పడుతుందన్నారు. ఇవాళ పున్నా కైలాష్ నేతను బెదిరిస్తున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కోసం డబ్బులు పంచింది 'మీరు' కాదా అని ప్రశ్నించారు. 'నీ క్షమాపణ అవసరం లేదు. నీ ప్రవర్తన మార్చుకో.. నీకు కోర్టుల మీద, రాజ్యాంగం మీద గౌరవముంటే గిట్లనేనా మాట్లాడేది' అని ప్రశ్నించారు. నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విషయంలో స్పందించాలన్నారు. కోమటిరెడ్డికి పాశ్చాత్తాపం లేదని, ఏనాడూ ఆయన చేసిన వ్యాఖ్యలను పున:పరిశీలన చేసుకోలేదని విమర్శించారు. పార్టీకి అక్కరొచ్చే పని చేయమంటే.. కాళ్లల్ల కట్టెలు పెడుతున్నారన్నారు. 'నా జీవితంలో ఏనాడూ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించలేదు.. నిరూపిస్తే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తా' అని అన్నారు. కోమటిరెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ.. చెరుకు సుధాకర్‌ని పార్టీలకతీతంగా ఉద్యమకారునిగా బహుజన వర్గాలకు చెందిన నాయ కునిగా సమాజం చూస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగంతో మాట్లాడిన మాటలు కావు.. అగ్రకుల అహంకారంతో మాట్లాడినట్టే ఉందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ.. చెరుకు సుధాకర్‌పై వెంకటరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనేక గ్రూపులు తయారు చేసి పంచాయితీలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి విధానం సరిగ్గా లేదన్నారు. ఈ సమావేశంలో తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నకరి కంటి కాశయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హుస్సేన్, ఎంఎస్పీ నాయకులు ఆడెపు నాగార్జున, యాతాకుల రాజయ్య, బకరం శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మెన్ పందుల సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.