Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతంత్ర సంస్థల పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపట్టాలి
- ఎస్వీకే వెబినార్లో జస్టిస్ నాగమోహన్దాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీబీఐ, ఈడీ వంటి సంస్థలు స్వతంత్రంగా పని చేయకుండా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల నుంచి వాటిని కాపాడుకోవాలని కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జి నాగమోహన్ దాస్ పిలుపునిచ్చారు. ప్రజలు మౌనం వీడాలని, లేకపోతే అంతా నష్టపోతారని హెచ్చరించారు. రాజ్యాంగం, స్వతంత్ర సంస్థల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో 'దృఢమైన రాజ్యాంగ సంస్థలు - నేటి ఆవశ్యకత' అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా నిర్వహించిన వెబినార్లో ఆయన ప్రసంగించారు. పాలనా వ్యవస్థ, శాసనవ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోయిందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై ఉన్న కొద్ది విశ్వాసం సన్నగిల్లకముందే ప్రజా అనుకూలంగా, క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ కారణాలతో సుప్రీంకోర్టు సిఫారసులను సైతం అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని గుర్తుచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యుల నియామకంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూ, మిగిలిన స్వతంత్ర సంస్థలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరముందని తెలిపారు. కేంద్రం నోట్ల రద్దు, జీఎస్టీతో రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరుస్తూ, తానే ఆర్థిక కేంద్రంగా మారుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులు, శ్రేయోభిలాషులుగా ఉండాల్సిన గవర్నర్లు రాజకీయ ప్రతినిధులుగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 2018 నుంచి 2022 సంవత్సరం వరకు 537 మంది న్యాయమూర్తులను నియమిస్తే అందులో 79 శాతం అగ్రకులాల నుంచి, 11.7 శాతం ఓబీసీలు, 2.8 శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.3 శాతం షెడ్యూల్డ్ తెగల నుంచి ఉన్నారని తెలిపారు. ఇది బహుళత్వ భారత సమాజాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తుందని ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థల అధిపతులకు జవాబుదారీతనం ఉండాలని, సామాన్యుడికి చట్టబద్ధ, మానవ హక్కులు కాపాడబడాలని ఆకాంక్షించారు. దీని కోసం సుప్రీంకోర్టు మరింత చురుగ్గా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ జడ్జీలు, ఉన్నతాధికారులను రాజ్యసభ సభ్యులు, ఇతర పోస్టుల్లో నియమిస్తున్న విషయంపై వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయా పదవుల నియామకాలకు తగిన మార్గదర్శకాలుంటే ఇలాంటివి అరికట్టే వీలుంటుందని తెలిపారు. కొలీజియంకు కూడా మార్గదర్శకాలు అవసరమన్నారు.