Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల కొద్ది నిరీక్షణ
- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6 వేల పెండింగ్ దరఖాస్తులు
- ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఉద్యోగ సంఘాలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కొడుకు ఉన్నత చదువుల కోసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ నాకు డబ్బులు రాకపోవడంతో కొడుకు చదువు అర్థాంతరంగా ఆగింది.
జిల్లా వైద్యశాఖలోని ఓ ఉద్యోగి ఆవేదన
బిడ్డ పెళ్ళి కోసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ప్రావిడెంట్ ఫండ్ వస్తుందన్న ఆశతో పెండ్లి కుదుర్చుకున్నాం. కానీ సకాలంలో డబ్బులు అందకపోవడంతో అప్పులు చేసి కూతురు పెళ్ళి చేయాల్సి వచ్చింది.
ఓ మహిళా టీచర్ ఆవేదన
భవిష్యత్ అవసరాల కోసం రూపాయి.. రూపాయి జమ చేసి దాచుకున్న డబ్బులు తీసుకుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు సకాలంలో అందడం లేదు. ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. పిల్లల చదువులు, శుభకార్యాలకు కూడా డబ్బులు అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కోసం సుమారు ఆరు వేల మంది దరఖాస్తు చేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో నాలుగు వేల మంది, వికారాబాద్‌లో రెండు వేల మంది ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌ను దరఖాస్తుదారుల ఖాతాలో జమ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 29 వేల మంది ఉన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 17 వేల మంది ఉండగా వికారాబాద్ జిల్లాలో 12 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా అపాయింట్ అయినప్పటి నుంచి తమ వేతనంలో కొంత డబ్బు 'జనరల్ ప్రావిడెంట్ ఫండ్' కింద జమ అవుతుంది. పిల్లల ఉన్నత చదువు కోసం, వైద్య ఖర్చులు, పిల్లల పెండ్లిల కోసం ఆ డబ్బులను తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో డబ్బులు తమ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రెండు, మూడేండ్లు అయినా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ దరఖాస్తుదారుల ఖాతాలోకి డబ్బులు జమ కావడం లేదు. రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 'ఈ కుబేరు' సంస్థను రెండేండ్ల క్రితం తీసుకొచ్చింది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు, ఆర్బీఐకి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తోంది. జిల్లా ట్రెజరీ నుంచి పాస్ అయిన బిల్లులు నేరుగా 'ఈ కూబేరు'లో జమ అవుతాయి. ఇక్కడ పాస్ అయిన బిల్లులు ఆర్బీఐ నుంచి నేరుగా దరఖాస్తుదారుల ఖాతాల్లో జమ అవుతాయి. కానీ ''ప్రభుత్వ అనుమతి కోసం'' అని దరఖాస్తుదారులకు సమాధానం వస్తోంది. ఏండ్లకొద్ది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కారణం ప్రభుత్వం వద్ద నిధుల్లేకేనని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు గుర్తించి సకాలంలో డబ్బులు జమ అయ్యేట్టు చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఆర్బీఐ నుంచి ఖాతాలో జమ అవుతాయి
జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కోసం వచ్చిన దరఖాస్తులు జిల్లాలో సుమారు నాలుగు వేల వరకు ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి పంపించాం. ఈ కుబేరు నుంచి ఆర్బీఐకి వెళ్తుంది. ఆర్బీఐ నుంచి డబ్బులు నేరుగా దరఖాస్తుదారుల ఖాతాలో జమ అవుతాయి.
- వెంకట్‌రెడ్డి , రంగారెడ్డి జిల్లా డీటీవో