Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొత్తులుండవ్...ఒంటరిగానే పోటీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులను ఇబ్బంది పెడుతున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 125 భూచట్టాలు ఉన్నాయనీ, వీటిని ఒకే చట్టం కిందకు తీసుకొస్తామన్నారు. మీ భూమి...మీ హక్కు పేరిట కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. భూమి సమస్యల పరిష్కారానికి పంచ సూత్రాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 119 నియోజక వర్గాలలోని గ్రామాల్లో ధరణి అదాలత్ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు వివరించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవనీ, ఒంటరిగానే బరిలోకి దిగుతామని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, జాతీయ కార్యదర్శులు నదీమ్ జావిద్, చల్లా వంశీచంద్ రెడ్డి, సుప్రియ, చామల కిరణ్‌రెడ్డి, పుష్పలీల తదితరులతో కలిసి జైరాం రమేష్ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పట్టాదారులు ఉంటే, దాదాపు 20 లక్షల మంది రైతులకు సమస్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంపూర్ణ సమగ్ర భూసర్వే జరుపుతామని చెప్పారు.
ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదని ఎద్దేవా చేశారు. భూ హక్కుదారులకు భూములను కల్పించడమేనన్నారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు... 30వేల జీవోలు ఉన్నాయనీ, వాటిని ఒకే చట్టంగా తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన భూ సేకరణ చట్టాన్ని రూపొందించిందని గుర్తు చేశారు. 2013లో తెచ్చిన చట్టం ప్రకారం భూయజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో సేకరించవద్దని చట్టం చెబుతున్నదనీ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారనీ, వారికి భరోసా కల్పిస్తామని చెప్పారు. 2010 మార్చిలోనే కాంగ్రెస్ మహిళా బిల్లు పెట్టిందనీ, 13 ఏండ్ల తర్వాత ఇప్పుడు కవిత ఈ విషయంలో పోరాటం చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.