Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ నిర్ణయం ప్రభుత్వానిదే
- విద్యుత్ జేఏసీ నేతలతో అధికారులు
- చర్చలకు మంత్రి గైర్హాజరు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన చర్చలు శుక్రవారం విద్యుత్‌సౌధలో జరిగాయి. విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు, సీఎమ్‌డీలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగాల్సి ఉండగా, ఆయన గైర్హాజరు అయ్యారు. దీనితో సీఎమ్డీలే జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. అయితే పీఆర్సీ ఎంత శాతం ఇస్తారనే విషయంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమనీ, దాన్ని మంత్రి ప్రకటిస్తారని సీఎమ్‌డీలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించేందుకు అధికారులు అంగీకరించినట్టు జేఏసీ నేతలు తెలిపారు. చర్చల్లో సీఎమ్‌డీలు దేవులపల్లి ప్రభాకరరావు, జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావుతో పాటు టీఎస్పీఈజేఏసీ చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకరరావు, కో చైర్మెన్ శ్రీధర్, కో కన్వీనర్ బిసి రెడ్డి, వైస్ చైర్మెన్లు వజీర్, అనిల్, జాయింట్ సెక్రటరీ గోవర్థన్, టీఈఈజేఏసీ అధ్యక్షులు ఎన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. సింగిల్ మాస్టర్ స్కేల్‌కు యాజమాన్యం ఆమోదించింది. ఆర్టిజన్ ఉద్యోగుల పర్సనల్ పే ను బేసిక్‌లో కలిపేందుకు అంగీకరించారు. మెడికల్ క్రెడిట్ కార్డుల విషయంలో చిన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించి రూ.5 లక్షలుగా ఉన్న సదుపాయాన్ని రూ.7 లక్షలకు, సెల్ఫ్ ఫండింగ్ స్కీంను రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచేందుకు అధికారులు ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకి వర్తించే గ్రాట్యూటీని విద్యుత్ ఉద్యోగులకు వర్తింపచేసేందుకు అనుకూలతను వ్యక్తం చేశారు. హౌస్ రెంట్ అలవెన్స్ సీలింగ్ పెంపుపై చర్చలు జరిగాయి. ఫిట్మెంట్, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్పు అంశాలను మాత్రం మంత్రి సమక్షంలో చర్చించాలని నిర్ణయిస్తూ, చర్చలను వాయిదా వేశారు. వారం రోజుల్లో మరోసారి మంత్రితో చర్చలకు ఆహ్వానిస్తామని సీఎమ్‌డీలు తెలిపారు.