Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరాబర్ ధరణిని రద్దు చేస్తాం
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో పరిష్కరిస్తాం
- ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలు : రేవంత్‌రెడ్డి
- పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ధరణి అదాలత్‌తో గ్రామసభ
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / పెద్దపల్లి / ఎలిగేడు / జగిత్యాల
''ధరణితో 9 లక్షల మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. అంతేకాదు.. ధరణి పోర్టల్‌ను బరాబర్ రద్దు చేస్తాం.. ధరణితో వేలాది ఎకరాల అసైన్డ్, పట్టా భూములు కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ భూములు తిరిగి పేదలకు పంచి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతాం. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలుగా మారాయి.. బండి సంజరు, కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దు'' అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర 24వ రోజు పెద్దపల్లి జిల్లా నుంచి జగిత్యాల జిల్లావరకు సాగింది. మధ్యలో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో ధరణి అదాలత్ పేరుతో నిర్వహించిన సభలో రైతులతో వారి భూసమస్యలపై మాట్లాడించారు. అనంతరం అక్కడి నుంచి జగిత్యాల జిల్లాకు పయనమై కొత్తబస్టాండ్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఆయా చోట్ల రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటాలకు మూలం భూమి అని, పేదవాడి ఆత్మగౌరవం, జీవన విధానం కూడా అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో భూములను సేకరించి 22లక్షల ఎకరాలను పేదలకు పంచామని చెప్పారు. 2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసీ, గిరిజనులకు 10లక్షల ఎకరాలు పంపిణీ చేసిందని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చి పేదలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. తమ జాతీయ నాయకులు జైరాంరమేష్ రూపకల్పన చేసిన ఆ చట్టాలకు కేసీఆర్, మోడీ కలిసి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతి గ్రామంలో నూ 20 సమస్యలు ఉంటే.. కేసీఆర్ తెచ్చిన ధరణితో 200 సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ధరణి విధానంలో లోపాలను సరి చేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. 'మీ భూ హక్కులకు మీకు తిరిగి కల్పించేందుకు కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది' అన్నారు. పేదల భూములు వారికే చెందేలా చేసే వరకు 'ధరణి అదాలత్' కొనసాగిస్తామని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉత్పత్తి రంగం కొద్ది మంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉన్నప్పుడు.. దేశంలోని పేదలకు భూమిని పంచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. అనంతరం ధరణి లోక్‌అదాలత్‌లో భాగంగా ప్రజల నుంచి వినతులు తీసుకుని వారికి 'కాంగ్రెస్ హామీ పత్రాలు' అందించారు. యాత్రలో కాంగ్రెస్ జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. నర్సింగాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.లక్ష ఆర్థికసాయం చేశారు.
లిక్కర్ స్కాంలో ఈడీ వివరణ ఇవ్వలే..
యాత్ర ఫర్ ఛేంజ్‌లో మీడియాతో రేవంత్ వ్యాఖ్య
లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరిం చనట్టు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహ రించడం లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ రెండూ బీజేపీ జేబు సంస్థలని వ్యాఖ్యానించారు.
అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొం టున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారని, అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గురవిందగింజ చందంగా ఉన్నారని విమర్శించారు.