Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా ప్రభుత్వంలో ధరణిని ఎత్తేస్తాం
- ఢిల్లీలో కవిత ధర్నాకు మా పార్టీ మద్దతు లేదు
- కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేష్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'మీ భూమి.. మీ హక్కు' నినాదంతో త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతామని, తెలంగాణలో తమ సర్కారు రాగానే ధరణి పోర్టల్‌ను ఎత్తేస్తామని ఆ పార్టీ జాతీయ నేత జైరాంరమేష్ తెలిపారు. ఢిల్లీలో కవిత చేపట్టిన ధర్నాకు తమ పార్టీ మద్దతు లేదని, కనీసం పాలుపంచుకోదని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధరణి అదాలత్ కార్యక్రమానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణిలో దాదాపు 20లక్షల ఖాతాల్లో సమస్యలున్నాయని, ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. తెలంగాణలో 15లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి సర్కారు నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదని తెలిపారు. ప్రస్తుతం భూములకు సంబంధించి 125 చట్టాలు.. 30వేల జీవోలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ క్రోడీకరించి ఒకే చట్టం తీసుకొస్తామన్నారు. యజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేకుండా 2013లోనే కాంగ్రెస్ సర్కారు చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. బలవంతపు భూసేకరణను నిషేధిస్తామని, ఆ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ జాతీయ నాయకులు కొప్పుల రాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.