Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ బచావో సదస్సు తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉమ్మడిగా ఉద్యమించాలని తెలంగాణ బచావో సదస్సు తీర్మానించింది. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ జరిగి 12 ఏండ్లైన సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కన్నెగంటి రవి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ సంక్షోభాల చౌరస్తాలో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారి చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యమ పార్టీగా అవతరించి బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షల స్ఫూర్తిని దెబ్బతీసిందని విమర్శించింది. రాష్ట్రం దివాళా తీసింది. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా...వాటిని భర్తీ చేయలేదు. ధరణి పోర్టల్‌తో సమస్యలను మరింత పెంచింది. దళిత బంధు పూర్తిస్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు. సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళికా రూపొందించలేదు. విద్యారంగాన్ని ధ్వంసం చేసింది. వైద్యరంగం ప్రయివేటుపరమైంది. తీవ్రమైన ఆర్థిక దోపిడీకి సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్ కేంద్రాలుగా మారాయి. పేదల కోసమంటూ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పైరవీలతో కొందరు దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో ఏకస్వామ్య, నిరంకుశ పాలన అమల్లో ఉంది. కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తున్నది. వాటి సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం లేదు...' అని సదస్సు తీర్మానించింది.
ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా ఐక్య ఉద్యమాల నిర్మాణం జరగాలనీ, వాటి నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రజలు, ఉద్యమ శక్తులపై ఉందని సదస్సు అభిప్రాయపడింది. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న రాష్ట్రంలోని అవినీతికర పాలన కూలిపోక తప్పదని స్పష్టం చేసింది. నిజమైన ప్రజాస్వామిక శక్తులు ప్రజలను ముందుకు నడిపించి, విజయం సాధించాలని పిలుపునిచ్చింది.
సదస్సులో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, వీక్షణం వేణుగోపాల్, ప్రజా గాయకులు గద్దర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గోవర్థన్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు.