Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యఉద్యమాలతో బీజేపీని ఓడిద్దాం
- ప్రజాపంథా సభలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏకీభవించనోడి పీకనొక్కడమే ఫాసిజం సహజలక్షణమని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాయలసుభాష్చంద్రబోస్(రవన్న) ఏడో వర్ధంతి సభను నిర్వహించారు. కె రమ అధ్యక్షతన జరిగిన సభలో హరగోపాల్ మాట్లాడుతూ సామాజిక పునాదిలో పురుషాధిపత్యం, కులం, మతం ఆవహించి ఉన్నాయని చెప్పారు.దీంతో మహిళలపై హింస,అణచివేత పెరిగిపోయిందన్నారు. స్త్రీని రెండో తరగతి పౌరురాలుగా చూస్తున్నారని చెప్పారు. క్రింది కులాలపై ఆధిపత్యం కొనసాగుతున్నదన్నారు.తద్వారా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మధ్యస్థ కులాలు కిందివైపు వస్తే..మార్పు వస్తుందనీ, పై కులాల వైపు పోతే ఫాసిజం వస్తుందని చెప్పారు. 1992లో రథయాత్ర చేసి, మతకొట్లాటలు సృష్టించి వేలాదిమంది చావుకు కారణమయ్యారని చెప్పారు.'భారత దేశంలో ఫాసిజం-ఆర్థిక రాజకీయ కారణాలు' అనే అంశంపై వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, 'ఫాసిజం-దళితుల, మైనార్టీలపై దాడులు' అంశంపై ప్రముఖ రచయిత సతీష్‌చందర్, 'ఫాసిజం-మహిళలు'అంశంపై సామాజిక విశ్లేషకులు దేవి, ఫాసిస్టు వ్యతరేక పోరాటాల అవశ్యకత'పై పోటు రంగారావు ప్రసంగించారు.భారత రాజ్యాంగంలో ఆమోదించిన కొద్దిపాటి హక్కులు కూడా ప్రశ్నార్ధకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం,పేదరికం, అసమానతలతోపాటు సకలరంగాల్లో సంక్షోభాలు ఎదురవుతున్నాయని చెప్పారు. మరో పక్క మత ఉన్మాదం, విద్వేషం,కట్టలు తెంచుకుని ప్రజలమీద స్వైర విహారం చేస్తున్నదని చెప్పారు. తిండిమీద, కట్టుబాట్లమీద, విశ్వాసాలమీద, స్వేచ్ఛాహక్కులమీద ఆంక్షలు విధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నే ద్వంసం చేసి మనువాదరాజ్యాంగ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దేశభక్తియుత శక్తులతో ప్రజాస్వామిక వాదులతో ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్, కె రంగయ్య,జి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎం హన్మేష్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.