Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పావులుగా సీబీఐ, ఈడీ, నిఘా వ్యవస్థలు : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే పనిలో మోడీ సర్కారు ఉందనీ, అందుకు సీబీఐ, ఈడీ, నిఘా, న్యాయ వ్యవస్థలను పావులుగా వాడుకుంటున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా గల్లీగల్లీ తిరుగుతూ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో మందా పవన్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కూనంనేని మీడియాతో మాట్లాడారు. మనీ ల్యాండరింగ్, ఇతర కేసుల్లో 51 మంది బీజేపీ ఎంపీలపైనా, 78 మంది ఎమ్మెల్యేలపైనా ఫిర్యాదులు అందితే ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. అదానీ, విజరుమాల్యా, లలిత్మోడీల కుంభకోణాల్లో వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. యూపీలో ప్రశ్నించే దళితులు, మైనార్టీలపై యోగీ తన ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. మోడీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 58,59 జీవోల కింద 2020 వరకు గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికే రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించడం సరిగాదన్నారు. ఇప్పటి వరకు గుడిసెలు వేసుకుని ఉంటున్న ప్రతిఒక్కరికీ అవకాశమివ్వాలనీ, గృహలక్ష్మి కింద వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వారికి కూడా ఇంటి స్థలం, రూ.3లక్షలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో చెప్పినట్టుగా 4.5లక్షల మందికి 13 లక్షల ఎకరాలకు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే ఎన్నికలలో గెలవలేమని కేంద్ర ఏజెన్సీలను మోడీ ప్రయోగిస్తున్నారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. మోడీ అధికారం చేపట్టినప్పుడు ఫోర్భ్స్ జాబితాలో 620వ స్థానంలో ఉన్న అదానీ.. రెండేండ్లలో ప్రపంచంలోనే రెండో ధనవంతునిగా ఎలా ఎదిగా డని నిలదీశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడీ హయాంలో ధరలు విపరీతంగా పెంచేస్తు న్నారనీ, ఇటీవల గ్యాస్, పెట్రోలు ధరలు పెద్ద ఎత్తున పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు రుణాలు తిరిగి చెల్లించకపోతే ఇండ్లను జప్తు చేస్తున్న బ్యాంకు అధికారులు...రుణాలు ఎగ్గొడుతున్న కార్పొరేట్ల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని నిలదీశారు.