Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు వెంకటేష్
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో నాన్ టీచింగ్, డైలీ వేజ్, ఎన్.ఎం.ఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులకు జీవో 63 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని యూని వర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూని యన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్, రాష్ట్ర అధ్యక్షులు మెట్టు రవి మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 యూని వర్సిటీలలో సుమారు 10 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో టైం స్కేల్, డైలీ వేజ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర పద్ధతుల్లో నియామకాలు జరుగుతున్నా యన్నారు అయితే, రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలోనూ ఈ సిబ్బందికి జాబ్ చార్ట్ లేదని, వేతనాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో వేతన నిర్ణయం అమలు చేయడం అన్యాయమన్నారు. యూనివర్సిటీల్లో నిర్ణయించిన కనీస వేతనాలు అతి తక్కువ ఉండగా, అందులోను ఏజెన్సీలు కార్మికుల వేతానాల్లో ఎక్కువ కోతలు విధిస్తున్నాయని చెప్పారు. 10 గంటల పని విధానం అమలులో ఉండటం వల్ల పని భారం పెరుగుతుందన్నారు. అధికారుల వేధింపులు, మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతున్నదని తెలిపారు. యూనివర్సిటీలో తప్పనిసరిగా జీవో 63 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల సర్వీస్ దాటిన వారిని టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కాంట్రాక్టర్ మారితే సిబ్బందిని తొలగించే అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ మానుకోవాలని సూచించారు. రిటైర్ అయిన సిబ్బందికి రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐపీఎఫ్ అమలు చేసి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. బస్సు పాస్ సౌకర్యం కల్పించి మహిళా ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.మహేందర్, సమ్మయ్య, ఎస్కే ఆవుర్, చిరంజీవి మహమ్మద్ సల్లర్ తదితరులు పాల్గొన్నారు.