Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధునిక టెక్నాలజీని వాడుతున్నాం
- రేపు సీఐఎస్ఎఫ్ రైజింగ్ పరేడ్
- మీడియాతో సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశంలోని పారిశ్రామిక అవసరాలకు అనుగు ణంగా అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నామని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు చెప్పారు. భద్రత, రక్షణ కల్పించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని వ్యాఖ్యానించారు. చిన్న సంఘటన జరిగినా తీవ్రంగానే పరిగణిస్తామనీ, విచారణ చేయడం ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ ఇండిస్టీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)54వ రైజింగ్ పరేడ్ నేపథ్యంలో శనివారం హాకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భధ్రతా అకాడమీ(ఎన్ఐఎస్ఏ)లో సీఐఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్(నార్త్) జనరల్ పీయూష్ ఆనంద్, అదనపు డైరెక్టర్ జనరల్(ఎయిర్‌పోర్ట్స్ అపరేషన్స్) జ్ఞానేందర్ సింగ్ మాలిక్, అదనపు డైరెక్టర్ జనరల్(సౌత్) జగ్బీర్‌సింగ్, ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ సునిల్ ఇమ్మాన్యుయేల్, డీఐజీ అనిల్పాండే సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైజింగ్ డే పరేడ్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని నేషనల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జాతీయ రాజధాని ప్రాంతం ( ఎన్సీఆర్ ) బయట చేపట్టడం ఇదే తొలిసారని చెప్పారు. 1969లో శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
54వ రైజింగ్ డే పరేడ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరవుతారని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు బలగాలను దగ్గరి నుంచి చూడాలనే ఉద్దేశంతో న్యూఢిల్లీ వెలుపలికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. సీఐఎస్ఎఫ్కి ఎన్ఐఎస్ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి రైజింగ్ డే పరేడ్ ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కవాతు సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అద్భుతమైన ప్రదర్శనలతో పాటు ప్రతిభావంతమైన సేవకు గాను ఒక గ్యాలంటరీ, 22 రాష్ట్రపతి పోలీసు పతకాలు, విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీసు పతకం సహా 23 పతకాలు అందజేయబడతాయని తెలిపారు. ప్రస్తుతం 66 విమానాశ్రయాలు , నౌకాశ్రయాలు , న్యూక్లియర్ , స్పేస్ ఇన్స్టాలేషన్న్లు, ఢిల్లీ మెట్రో , స్టీల్, పవర్ ప్లాంట్లు సహా దేశంలోని 354 కీలకమైన పారిశ్రామిక సంస్థలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నదని చెప్పారు. తమ సంస్థ 1.70 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉందని చెప్పారు. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌కు చెందిన బెంగళూరు , పూణే , ఎలక్ట్రానిక్ సిటీ , బెంగళూరు యూనిట్లకు, ఒడిశాలోని టాటా స్టీల్ కళింగనగర్ సహా 11 ప్రైవేట్ సంస్థలకు భద్రతను విస్తరిస్తున్నామని వివరించారు. ఆయా అవసరాల కోసం ఎప్పటికప్పుడు నియామకాలు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సీఐఎస్ఎఫ్ శక్తిసామర్థ్యాలను పెంచుకుంటున్నామని అన్నారు. భద్రత, రక్షణ తమ మోటో అని గుర్తు చేశారు. సీఐఎస్‌లో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని చెప్పారు. మొత్తం సిబ్బందిలో 6.7 శాతం మహిళలు ఉన్నట్టు చెప్పారు. రెగ్యులర్‌గా ప్రమోషన్లు కల్పిస్తున్నామన్నారు. ఆయా సంస్థలకు సెక్యూరీటీ ఇచ్చే క్రమంలో ఏదైనా దుర్ఘటన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. అవసరమైన విచారణ చేసి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
భద్రత కల్పించేందుకు అవసరమయ్యే ఖర్చును ఆయా సంస్థలే 78 శాతాన్ని భరిస్తున్నాయని చెప్పారు. విమానంలో ఎదైనా ఘటన జరిగితే ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రకారం బాధ్యులైన వారిని గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించి కేసు నమోదయ్యేలా చూస్తామని చెప్పారు. అంతర్గత అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు పటిష్టమైన విజిలెన్స్ అందుబాటులో ఉందని చెప్పారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని వివరించారు. శిక్షణ అభ్యర్థులకు చట్టం గురించి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. టెక్నికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తమ విధుల నిర్వహణలో ఆయా రాష్ట్రాల్లోని స్థానిక ప్రభుత్వాలు, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. విమానయానం సందర్భంగా ఎయిర్‌పోర్టుల్లో ఉండే తమ సిబ్బందిని చిరునవ్వుతో పలకరించి 'థాంక్యూ' అని చెబితే తామెంతో సంతోషిస్తామనీ, తాము అదే కోరుకుంటున్నామని వివరించారు.