Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుస్మృతి అమలుకు బీజేపీ కుట్రలు
- ఎమ్మెల్సీ కవిత దీక్షకు ఐద్వా మద్దతు
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-బోధన్
ఉపాధి హామీలో సంవత్సరానికి 200 పనిదినాలు కల్పించి, ప్రతి రోజూ రూ.600 వేతనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉర్దూఘర్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో హామీలే తప్ప కార్యాచరణ ఏమి చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మహిళలు సమాన అవకాశాలు పొందలేకపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 33శాతం మహిళ రిజర్వేషన్ అమలుచేస్తే 180 మంది మహిళలకు చట్ట సభల్లో అవకాశం వస్తుందని అన్నారు. అలాగే 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న దీక్షకు ఐద్వా ఆధ్వర్యంలో మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆకలి సూచికలో భారతదేశం ప్రపంచ దేశాల్లో 112వ స్థానంలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసర ధరలు పెరగడం కాకుండా ప్రజలు ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు పౌష్టికాహారం కరువై రక్తహీనతతో బాధపడుతున్నారని, కావున ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో దేశ వ్యాప్తంగా మనుస్మృతిని అమలు చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు.
మనుస్మృతి అమలయితే మహిళల హక్కులు లేకుండా పోతాయని, మహిళలు ఆంక్షలతో ఇంటికే పరిమితమవుతారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కొరవడిందని, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఇండ్లు లేక గుడిసెలలో ఉన్న వారికి పట్టాలిచ్చి ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు.
అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెతో పాటు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ను నాయకులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్పా, రైతు సంఘం జిల్లా నాయకులు గంగామణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు గంగాధర్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.