Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షల కోట్లను లూటీ చేసిన అదానీని ఎందుకు అరెస్టు చేయరు :సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మోడీ బినామీ అదానీ అని, లక్షల కోట్ల దేశ సంపదను లూటీ చేసిన అదానీని ఎందుకు అరెస్టు చేయరని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మోడీకి బినామీ ప్రముఖ వ్యాపారవేత్త అదానీ అని విమర్శించారు. ఈ దేశ ప్రజల సొత్తు లక్షల కోట్లను అప్పనంగా అదానీకి కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేసిన అదానీపై ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈడీ, సీిబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు చివరికి న్యాయ వ్యవస్థలు సైతం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని చెప్పారు. చిన్న చిన్న విషయాల్లో హడావుడి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. లక్షల కోట్ల ప్రజాధానాన్ని లూటీ చేసిన అదాని కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కర్నాటకలోని బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలు బయట పడ్డాయన్నారు. అతడిని అరెస్టు చేయకముందే ముందస్తు బెయిల్ తీసుకోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దోషి అయిన సంతోష్‌కు కూడా కోర్టు బెయిల్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేతలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశానికి నష్టం కల్గించేవిధంగా చేస్తున్నారని విమర్శించారు.
స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించి లౌకిక వాదాన్ని ప్రచారం చేసిన గాంధీని చంపిన గాడ్సేకు గుడులు కట్టించే పాలకుల ఏలుబడిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో గాంధీ పక్కన మతవాది సావర్కర్ ఫొటోను పెట్టాలనుకోవడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో కుబేరుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న వారు ప్రతిపక్షాలైనా.. ప్రజా సంఘాల వారైనా.. మేధావులు ఎవరైనా అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ వ్యవస్థను మనం కాపాడుకోకపోతే మునుముందు మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ ప్రజాస్వామ్య, లౌకికతత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం కోసం.. ఈనెల 17 నుంచి 28 వరకు జన చైతన్య యాత్ర నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ జాతాలకు ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాల వారు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడి, రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ , కడియాల మోహన్ తదితరులు పాల్గొన్నారు.